‘యువగళం’ హామీలు అమలు చేయాలి
పుట్టపర్తి టౌన్: యువగళం పాదయాత్రలో నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శేషం మహేంద్ర, కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా శుక్రవారం పుట్టపర్తిలోని గణేషకూడలిలో ధర్నా చేపట్టి, మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న విద్యార్థులకు బకాయి పడిన ఫీజు రీయంబర్స్‌మెంట్ రూ.2,100 కోట్లు, వసతి దీవెన నిధులు రూ.1,480 కోట్లను తక్షణమే విడుదల చేయాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు పేరుకుపోవడంతో కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఆయా కళాశాలల యాజమాన్యాలు మొండికేస్తున్నాయని మండిపడ్డారు. జీఓ నంబర్ 77ను రద్దు చేయడంతో పాటు పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామంటూ నాడు ప్రతిపక్షంలో ఉంటూ చేపట్టిన యువగళం పాదయాత్రలో నారా లోకేష్ స్పష్టమైన హామీనిచ్చారని గుర్తు చేశారు. నేడు అధికారం చేపట్టి 8 నెలలు కావస్తున్నా నేటికీ ఈ హామీల అమలుపై నిర్లక్ష్యం కనబరుస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని, లేకపోతే ప్రజలను చైతన్యవంతులను చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అరుణ్‌రెడ్డి, నరసింహమూర్తి, సాయిగౌతమ్, రవి, చరణ్, గోపి, విశ్వనాథ్, అనిల్, శ్యామ్‌సుందర్, అశోక్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్‌ఎఫ్ నాయకుల డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment