క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి
పుట్టపర్తి అర్బన్: సీఎం కార్యాలయం నుంచి వచ్చే ప్రతి అర్జీనీ క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్ చేతన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జేసీ అభిషేక్‌కుమార్, డీఆర్‌ఓ విజయసారథి, డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టి వాటికి రికార్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. త్వరలో జరిగే రాష్ట్రస్థాయి సమావేశాల్లో ఆర్డీఓలు పాల్గొంటారని, డివిజన్‌కు సంబంధించిన ప్రతి అంశంపైనా అవగాహన ఉండాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అర్జీలు రీ ఓపెన్ అయితే అందుకు తగిన కారణాలు వివరించాలన్నారు. రెవెన్యూ అంశాలకు సంబంధించి కంటెంట్ కేసులు జిల్లాలో 32 ఉన్నాయని, వాటిని హైకోర్టులో కౌంటర్ ఫైల్ చేశారా లేదా అని ఆర్డీఓలు చూసుకోవాలన్నారు. ఫ్రీహోల్డ్ వెరిఫికేషన్ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణపై 4,633 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 3,904 పరిష్కరించామని తెలిపారు. ఫారం 6, 7, 8ను సంబంధిత బీఎల్‌ఓలు సమగ్ర విచారణ జరిపి నివేదికలు సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, కలెక్టరేట్ లోని అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
టిప్పర్ల సీజ్‌తో ముదిరిన రాజకీయ వివాదం
పెనుకొండ: మంత్రి సవిత – ఎంపీ బీకే పార్థసారథి మధ్య రాజకీయ వివాదం ముదిరింది. టిప్పర్ల సీజ్ వ్యవహారంతో ఇది మరోసారి బయటపడింది. వివరాల్లోకెళితే.. పుట్టపర్తి మండలం గంట్ల మారెమ్మ గుడి వద్దనున్న కంకర మిషన్ నుంచి కియా పరిశ్రమ సమీపంలోని గ్రీన్‌టెక్ మిక్సింగ్ ప్లాంట్ వద్దకు టిప్పర్ల ద్వారా కంకర తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి అధిక లోడ్‌తో వెళ్తున్న టిప్పర్లను కియా పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రాజేష్, సిబ్బంది సీజ్ చేసి.. ఆర్టీఏ అధికారులకు స్వాధీనం చేశారు. అయితే గ్రీన్‌టెక్ నిర్వాహకులు హిందూపురం ఎంపీ బీకే పార్థసారథిని ఆశ్రయించారు. దీంతో ఎంపీ రంగంలోకి దిగారు. ఇదంతా మంత్రి సవిత అనుచరులు కొందరు చేయిస్తున్నారని, తొందరపడి చర్యలు తీసుకోవద్దని పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. సమస్య ఎటు దారి తీస్తుందోనని పోలీసులు కేసు నమోదు చేయడంపై ఆగ్రహంతో ఉన్న ఎంపీ, ఆయన అనుచరులు కియా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. దీంతో మీడియా సైతం స్టేషన్ వద్దకు చేరుకుంది. అయితే విజయవాడ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చిన ఎంపీ నేరుగా పెనుకొండలోని స్వగృహానికి చేరుకున్నారు. స్టేషన్‌కు రాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీఏ అధికారులు ఫైన్ వేసి రాత్రి 7.30 గంటల సమయంలో టిప్పర్లను విడిచిపెట్టినట్లు ఎస్‌ఐ రాజేష్ తెలిపారు.
విద్యుత్ ప్రమాద మృతి కేసులో రెండేళ్ల జైలు
మడకశిర: విద్యుత్ ప్రమాద మృతి కేసులో హనుమంతరాయప్ప అనే ముద్దాయికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుడ్డయ్యపాళ్యం గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప నాలుగేళ్ల క్రితం తన దానిమ్మతోటకు రక్షణగా ముందు జాగ్రత్తలేవీ తీసుకోకుండా విద్యుత్ తీగలు అమర్చాడు. తోటలోకి వెళ్లిన ప్రసాద్ అనే వ్యక్తి విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి ఏఎస్‌ఐ కృష్ణారెడ్డి కేసు నమోదు చేశారు. ప్రసాద్ మృతికి ముద్దాయి హనుమంతరాయప్పను కారకుడిగా భావించి రెండేళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి అశోక్‌కుమార్ శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ కేసును ఏపీపీ విఠల్‌రావు వాదించారు.
23న జాబ్ మేళా
మడకశిర: పట్టణంలోని ఎస్‌వైటీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న ఉదయం 9 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి హరిక్రిష్ణ, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ చేసిన యువతీ యువకులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. 8 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేసారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment