ఒకే ఒక క్షణం..
బత్తలపల్లి: అనంతపురం – చైన్నె మార్గంలోని జాతీయ రహదారిపై బత్తలపల్లి మండలం రామాపురం కూడలిలో శుక్రవారం ఉదయం ఓ బొలెరో వాహనం ప్రమాదానికి గురైంది. వేగంగా వెళుతున్న వాహనం టైరు పేలడంతో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఘటనలో ఆరుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది.
వివరాలు ఇలా...
బత్తలపల్లి మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన కదిరిప్ప, ధర్మవరం పట్టణ నివాసి గంగప్ప, ఇదే మండలం నాగలూరుకు చెందిన ముత్యాలప్ప, రంగా, హరి దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. వీరిలో రంగా బొలెరో వాహన డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అందరూ కలసి శుక్రవారం ఉదయం ధర్మవరం పట్టణానికి చెందిన చితంబరం అనే వ్యక్తి ముదిగుబ్బలో కొనుగోలు చేసిన తుమ్మ మొద్దులను ధర్మవరానికి తరలించేందుకు కూలి పనికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బొలెరో వాహనంలో లోడ్ చేసిన మొద్దులపై కూలీలు కూర్చొని ప్రయాణిస్తున్నారు. బత్తలపల్లి మండలం రామాపురం కూడలికి చేరుకోగానే రోడ్డు రాపిడి కారణంగా వేడెక్కిన టైర్ ఒక్కసారిగా పేలింది. దీంతో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న జాతీయ రహదారి డివైడర్‌ను ఢీకొనడంతో మొద్దులన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. వాటిపై కూర్చొన్న కూలీలు మొద్దుల కింద పడి రక్తగాయాల పాలయ్యారు. దినసరి కూలీలతో పాటు చితంబరం కూడా గాయపడ్డాడు. ఆ సమయంలో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి వైద్యులు రెఫర్ చేశారు. వీరిలో ముత్యాలప్ప పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
డివైడర్‌ను ఢీ కొన్న బొలెరో
ఆరుగురికి తీవ్ర గాయాలు
ఒకరి పరిస్థితి విషమం
ఒకే ఒక క్షణం. కలో.. నిజమో.. నిర్ధారించుకునే లోపు హాహాకారాలు మిన్నంటాయి. డివైడర్‌ను బొలెరో ఢీకొనడంతో కన్నుమూసి తెరిచేలోపు ఆ ప్రాంతం మొత్తం భయానక వాతావరణం నెలకొంది. తుమ్మ మొద్దుల మధ్య నలిగిన కూలీలు... నెత్తురోడుతున్న శరీరాలు... సహాయక చర్యల్లో నిమగ్నమైన స్థానికుల కేకలతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది.
Comments
Please login to add a commentAdd a comment