నియంత్రణ సాధ్యమే
సాక్షి ప్రతినిధి, అనంతపురం: గుండె లయ తప్పుతోంది. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం వస్తుందో ఊహించలేని పరిస్థితి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నామనుకునే యువతనూ భయపెడుతోంది. దూకుడు మీదున్న ఈ గుండెజబ్బుల నియంత్రణ అంతుచిక్కడం లేదు. గతంలో 50 ఏళ్లు దాటితే గానీ గుండెజబ్బులు వచ్చేవి కావు. పరిస్థితులు తల్లకిందులయ్యాయి. ఇంటర్మీడియెట్ చదువుతున్న 17 ఏళ్ల కుర్రాడు కూడా గుండెపోటుతో కుప్పకూలిపోవడం వైద్యులకే అంతుచిక్కడం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏటా 20 వేల మంది గుండెజబ్బుల బారిన పడుతున్నట్లు తేలింది.
దురలవాట్లే దుఃఖానికి కారణం..
నిండా 30 ఏళ్లు దాటని సాఫ్ట్‌వేర్ ఉద్యోగి గుండెపోటుతో మృతిచెందడం బాధాకరం. కానీ అతని అలవాట్లే కొంపముంచాయి. 80 శాతం మంది యువతీ యువకుల్లో గుండెపోటు రావడానికి సరైన ఆహార నియమాలు లేకపోవడం, వ్యాయామం అసలే లేకపోవడం కారణమని తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో ఏటా సగటున 20 వేల మందికి పైగా గుండెపోటు అనుభవవాలను చవిచూస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా మొత్తం జబ్బులకయ్యే వ్యయంలో 30 శాతం గుండె జబ్బులకే అవుతుండటాన్ని బట్టి చూస్తే వీటి తీవ్రత ఎలా ఉందో అంచనా వేయొచ్చు.
వ్యాయామం నిల్..
రోజువారీ వ్యాయామం లేకపోవడం అత్యంత ప్రమాదకరంగా ఉంది. 80 శాతం మందికి వ్యాయామంపై అవగాహన లేదని వెల్లడైంది. దినసరి కేలరీలు ఖర్చు కావాలంటే కచ్చితంగా నడక ఉండాలనే అవగాహన అతికొద్ది మందిలో మాత్రమే ఉంది. మరోవైపు మితాహారం, పౌష్టికాహారం తినడంలోనూ సమతూకం లేదు. దీంతో పాటు మద్యం, సిగరెట్లు తాగే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వీటివల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారానికి 150 నిమిషాలు కనీస నడక మంచిదని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, రక్తపోటు ఉన్న వారికి నడక అత్యంత అవసరమని వైద్యులు పదే పదే సూచిస్తున్నారు.
కొలెస్ట్రాల్ ప్రమాదం చాలామందికి తెలియదు
శరీరంలో రెండు రకాల కొవ్వులుంటాయి. ఒకటి హెచ్‌డీఎల్ (హై డెన్సిటీ లిపోప్రొటీన్స్), రెండోదిఎల్‌డీఎల్ (లో డెన్సిటి లిపోప్రొటీన్స్). ఈ రెండింటిలో హెచ్‌డీఎల్ మంచి కొలెస్ట్రాల్ కాగా, ఎల్‌డీఎల్ అత్యంత ప్రమాదకరం. 40 ఏళ్ల వయసు దాటాక కనీసం ఆరుమాసాలకు ఒకసారైనా షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ టెస్టులు చేయించుకొని మందులు వాడితే గుండెపోటు నియంత్రించుకోవచ్చు.
అనంతపురం రూరల్ పరిధిలోని సిండికేట్‌నగర్‌కు చెందిన భాస్కర్‌రాజుకు 32 ఏళ్లు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 8వ తేదీన ఉదయం ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. కారణమేమని డాక్టర్లను అడిగితే ‘గుండెపోటు’ అని చెప్పారు.
బత్తలపల్లికి చెందిన ఉషారాణిదీ ఇదే పరిస్థితి. ఈమె వయసు 38 ఏళ్లు. ఎంబీఏ పూర్తిచేసిన ఈమె హైదరాబాద్‌లో పనిచేస్తోంది. ఉన్నఫళంగా ఛాతీలో నొప్పిరావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇంటెన్సివ్ కేర్‌లో అరగంట ఉన్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గుండెపోటుతో చనిపోయింది.
చిన్న వయసు నుంచే
గుండెపోటు లక్షణాలు
కొంప ముంచుతున్న
ఆహారపు అలవాట్లు
మద్యం, పొగతాగే వారిపై తీవ్ర ప్రభావం
వ్యాయామం లేని వారికి డేంజర్ బెల్స్
ఏడాదికి సగటున20 వేల మందిలో లక్షణాలు
గుండె జబ్బుల నియంత్రణ అసాధ్యమేమీ కాదు. బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక జబ్బులను నియంత్రణలో ఉంచుకోవాలి. నడవడం, మెట్లెక్కడం వంటి శారీరక శ్రమ అవసరం. రోజూ 20 నిమిషాల ధ్యానం మంచిదే. రాత్రి కనీసం 8 గంటల నిద్ర ఉండాలి. ప్రొటీన్లతో కూడిన చిక్కుళ్లు, బఠానీ, చేపలు, బాదం, పిస్తా వంటివి తినడం మంచిది. ఊరగాయలు, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉండటం, తగినంత నీరు తీసుకోవడం చేస్తే గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు.
– డా.పి.సుధాకర్‌రెడ్డి,
గుండె జబ్బుల నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment