‘దళవాయి’కి రిపబ్లిక్ డే వేడుకల ఆహ్వానం
ధర్మవరం రూరల్: జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన తోలుబొమ్మల కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత దళవాయి చలపతికి కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. 2025 జనవరి 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానిస్తూ బుధవారం సమాచారం పంపింది. తనను గుర్తించి ఆహ్వానం పంపిన కేంద్ర ప్రభుత్వానికి దళవాయి చలపతి కృతజ్ఞతలు తెలిపారు.
వాహనాలను దౌర్జన్యంగా
అడ్డుకుంటున్నారు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన
‘గ్రీన్ టెక్’ సంస్థ
పెనుకొండ రూరల్: తమ వాహనాలను కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా అడ్డుకుంటున్నారని గ్రీన్‌టెక్ సంస్థ మేనేజర్ అశోక్ మంగళవారం కియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అందులో పేర్కొన్న వివరాల మేరకు... గ్రీన్‌టెక్ సంస్థ పెనుకొండ మండలం మక్కాజిపల్లి తండా సమీపంలో రెడీమిక్స్ కాంక్రీట్ పరిశ్రమ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి సామగ్రి తీసుకెళ్లే వాహనాలను జాతీయ రహదారి–44 నుంచి మక్కాజిపల్లికి వెళ్లే మార్గంలో కొందరు వ్యక్తులు అడ్డుకుంటున్నారు. వాహన డ్రైవర్లపై దౌర్జన్యానికి దిగుతున్నారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని..తమ వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా చూడాలని పోలీసులను మేనేజర్ కోరారు.కాగా..గ్రీన్‌టెక్ ఫిర్యాదుపై కియా పోలీసులు స్పందించలేదు. దీంతో సంస్థ యాజమాన్యం బుధవారం డయల్ 100కు సమాచారం అందించింది. ఉన్నతాధికారులు స్పందించి స్థానిక పోలీసులను ఆదేశించడంతో పట్టణ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో గ్రీన్‌టెక్ పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. ప్రస్తుత పరిణామాలపై మేనేజర్‌తో ఆరా తీశారు.
మహిళలకు కంప్యూటర్ శిక్షణ, ఉపాధి అవకాశాలు
రాప్తాడు: ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలోని ఎస్‌ఎల్‌సీ (సెల్ఫ్ లెర్నింగ్ సెంటర్)లో నిరుద్యోగ మహిళలకు 45 రోజుల పాటు వివిధ కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ ఎంటీఎల్ ఇంద్రజ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, బేసిక్ టాలీ, ఎంఎస్ ఆఫీస్, తెలుగు, ఇంగ్లిష్ టైపింగ్, లైఫ్ స్కిల్స్, వర్క్ ప్లేస్ ఎథిక్స్, బేసిక్ స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ రిలేషన్ షిప్ స్కిల్స్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఏదైనా డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి, 20 నుంచి 35 ఏళ్ల వయసున్న మహిళలు అర్హులు. ఆసక్తి ఉన్న వారు రూ.2 వేలు రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 73969 50345, 91001 02811 నంబర్లలో సంప్రదించవచ్చు.
శతాధిక వృద్ధురాలి మృతి
రొద్దం: స్థానిక ప్రాథమిక పాఠశాల విశ్రాంత అటెండర్ హుసేనమ్మ(109) బుధవారం మృతి చెందారు. వయస్సు మీద పడినా తన పని తాను చేసుకుంటూ దృష్టి, వినికిడి లోపం లేకుండా అందరినీ పలకరిస్తూ ఉండే వారని ఆమె కుమారుడు రైల్వే బాబు తెలిపారు. అయితే రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురై ఆమె బుధవారం మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఏడాది ఆమె 109 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు వివరించారు. విషయం తెలుసుకున్న పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు హుసేనమ్మ ఇంటికి వెళ్లి ఆమె మృతదేహానికి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment