సైబర్ నేరగాడు అరెస్ట్
అనంతపురం: ఆరోగ్యశ్రీ విభాగం పేరుతో రోగుల బంధువులకు ఫోన్ చేసి తన ఖాతాకు యూపీఐ పేమెంట్స్ ద్వారా నగదు వేయించుకుంటున్న సైబర్ నేరగాడిని అనంతపురం టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శ్రీకాంత్ యాదవ్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం దుబ్బార్లపల్లికి చెందిన సాకే ఓబులేసు కుమారుడు సాకే శివయ్య బీఈడీ వరకు చదివి బెట్టింగ్, జల్సాలకు అలవాటు పడ్డాడు. సులువుగా డబ్బు సంపాదించడం కోసం రక్తబంధం గ్రూపు ఆర్గనైజేషన్ ట్రస్టు అనే వాట్సాప్ గ్రూపులో జాయిన్ అయి, ఆ గ్రూపులో రక్తం ఎవరికి అవసరం అవుతుందో ఆ సెల్ నంబర్‌కు ఫోన్ చేసి ‘నేను ఆరోగ్యశ్రీ విభాగం నుంచి అని పరిచయం చేసుకుని మీకు ఉచితంగా ట్రీట్‌మెంట్ కావాలంటే కొంత డబ్బు చెల్లించాలని ఫోన్‌పే, గూగుల్ పే ద్వారా డబ్బులు వేయించుకుని, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుండేవాడు. ఈ నెల 13న సర్వజనాస్పత్రి ఆర్థో వార్డు, గైనిక్ వార్డులో ఉన్న ఐదుగురు పేషెంట్లకు ఫోన్ చేసి వారి నుంచి రూ.12 వేలు డిపాజిట్ చేయించుకని మోసం చేశాడు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు సైబర్ నేరం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు సాకే శివయ్యను శనివారం అరెస్ట్ చేశారు. డిసెంబర్ నుంచి ఇప్పటి దాకా మొత్తం 12 మంది అమాయకుల నుంచి రూ.30 వేలు అక్రమంగా డబ్బు వేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment