విశాఖ ఉక్కును ‘సెయిల్’లో విలీనం చేయాలి
మడకశిర: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేసే చర్యలను వెంటనే నిలిపివేసి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో విలీనం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కె.ఆనందరంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రకటించిన రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఏమాత్రం సరిపోదన్నారు. ప్యాకేజీతో కేంద్రం పరిశ్రమను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కర్ణాటకలోని భద్రావతిలో ఉన్న విశ్వేశ్వరయ్య ఉక్కు కర్మాగారం సామర్థ్యం కేవలం 0.7 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా, నెల రోజుల క్రితం కేంద్ర మంత్రి కుమారస్వామి రూ.15 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారని, మరి 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న విశాఖ ఉక్కుకు ఎంత ఇవ్వాలో ప్రభుత్వ పెద్దలే ఆలోచించాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలని ఉద్యమ కారులంతా డిమాండ్ చేస్తున్నారని, దాన్ని పక్కన పెట్టి కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం... దాన్ని కూటమి నాయకులు ఆహ్వానించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ హయాంలోనే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలను అడ్డుకున్న ఏకై క నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనని ఆనందరంగారెడ్డి గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో విశాఖ ఉక్కును ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వైఎస్ జగన్ అడ్డుకున్నారని స్వయానా కేంద్ర మంత్రి కుమారస్వామే చెప్పారన్నారు. ఇప్పటికై నా కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే చర్యలు నిలిపివేయాలని, ఉద్యమకారులు, కార్మికుల న్యాయమైన డిమాండ్లకు అనుగుణంగా విశాఖ ఉక్కును ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్యాకేజీతో విశాఖ ఉక్కు కర్మాగారం గట్టెక్కదు
ప్రైవేటీకరణను వ్యతిరేకించిన ఏకై క నాయకుడు వైఎస్ జగన్
వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆనందరంగారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment