‘నవోదయ’ పరీక్షకు 5,492 మంది హాజరు
లేపాక్షి: నవోదయ విద్యాలయలో 6వ తరగతి ప్రవేశాలకు శనివారం నిర్వహించిన రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 7,987 మంది దరఖాస్తు చేసుకోగా అధికారులు 34 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 5,492 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మరో 2,495 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 19 పరీక్ష కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు.
21న జిల్లాకు జాతీయ
ఎస్టీ కమిషన్ సభ్యుడు
ప్రశాంతి నిలయం: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతు హుస్సేన్ ఈనెల 21న పుట్టపర్తికి రానున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20న బెంగళూరులో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న జాతు హుస్సేన్, 21వ తేదీ అక్కడి నుంచి రోడ్డు మార్గాన కదిరి చేరుకుని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారని వెల్లడించారు. అనంతరం కదిరి రూరల్ పరిధిలోని రామ్‌దాస్ తండా, బోడి నాయక్ తండా, నాయక్ తండాలను సందర్శిస్తారన్నారు. అదే రోజు ఉదయం 11 గంటలకు ముదిగుబ్బ మండలంలోని జొన్నల కొత్తపల్లిలో పర్యటిస్తారన్నారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5 గంటల వరకు కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్, ఆర్డీఓలు, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారులు, డీఎస్పీలతో సమావేశమై సమీక్షిస్తారని తెలిపారు.
సత్య శ్రీనివాసం..
ఆధ్యాత్మిక వైభవం
ప్రశాంతినిలయం: తిరుమలలో వెలసిన శ్రీనివాసుడి ప్రతి రూపమే సత్యసాయి అన్న సందేశాన్నిస్తూ భక్తులు ప్రదర్శించిన సంగీత నృత్యరూపకం పరవశింపజేసింది. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన తిరుపతి సత్యసాయి భక్తులు శనివారం సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ‘సత్య శ్రీనివాసం’ పేరుతో సంగీత నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. అవతారమూర్తులు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, వెంకటేశ్వరుడి లీలా వైభవాన్ని వివరిస్తూ కళియుగంలో అవతరించిన దైవస్వరూపుడు సత్యసాయి అన్న సందేశాన్నిచ్చారు. వెంకటేశ్వర స్వామి లీలా వైభవాన్ని, సత్యసాయి లీలను కొనియాడుతూ చక్కటి ఘట్టాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అంతకుముందు ఉదయం సత్యసాయిని కీర్తిస్తూ వారు నిర్వహించిన సంగీత కచేరీ అలరించింది. అనంతరం వారు సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
కుష్టు వ్యాధిని
నయం చేయొచ్చు
పుట్టపర్తి అర్బన్: కుష్టును ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఆరు మాసాల్లోనే వ్యాధిని నయం చేయొచ్చని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఫైరోజ్‌బేగం తెలిపారు. శనివారం పుట్టపర్తి పీహెచ్‌సీలో వైద్యాధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ కుష్టువ్యాధి నిర్మూలనపై అవగాహన ర్యాలీ ప్రారంభించారు. ఎనుములపల్లి నుంచి గణేష్ సర్కిల్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ మానవహారంగా ఏర్పడ్డారు. డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో కుష్టు వ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను నివృత్తి చేసి, వ్యాధి సోకిన వారిని గుర్తించి తగిన చికిత్స అందించాలన్నారు. జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ తిప్పయ్య మాట్లాడుతూ మనిషిలో దాగి ఉన్న వ్యాధి లక్షణాలను గుర్తించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 2 వరకు వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే చేయనున్నారన్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు చేయించాలని ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ నివేదిత పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment