సొంతిల్లు కట్టుకుంటావా.. నీకది ఇక కలే
కూడు...గూడు..మనిషి కనీస అవసరాలు. ఏ ప్రభుత్వాలైనా వీటిపైనే దృష్టి సారిస్తాయి. కానీ రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి సర్కార్ నిరుపేదలకు మేలు చేయాల్సింది పోయి.. అన్యాయం చేసేందుకు సిద్ధమైంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో స్థలాలు పొంది ఇళ్లు నిర్మించుకోలేని వారి పట్టాలు రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. వాటిని తిరిగి తమ అనుచరులకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. దీంతో జిల్లాలోని వేలాది మందికి సొంతిళ్లు కలగానే మిగిలిపోనుంది.
జగనన్న లేఅవుట్లలో పట్టాల రద్దుకు కుట్ర
పుట్టపర్తి: ఏడు నెలల పాలనలో అన్ని వర్గాలనూ ఏడిపించిన కూటమి సర్కార్... తాజాగా నిరుపేదలకు నిలువనీడ లేకుండా చేసేందుకు సిద్ధమైంది. నిరుపేదల ఇళ్ల నిర్మాణాలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచామంటూ ఓ వైపు ప్రచారం చేస్తూ... మరోవైపు ఇప్పటికే స్థలాలు పొంది ఆర్థిక ఇబ్బందులతో ఇల్లు నిర్మించుకోలేని వారి పట్టాలు రద్దు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్‌లో నిర్ణయం కూడా తీసుకుంది. పేదల గూడుపై కూటమి నేతలు చేస్తున్న కుట్రపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
7 వేలకుపైగా పట్టాల రద్దు!
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ నిరుపేదల సంక్షేమానికి కృషి చేశారు. ముఖ్యంగా ఇళ్లులేని నిరుపేదలకు కుల, మత, రాజకీయాలకు అతీతంగా పట్టాలిచ్చి ఇళ్ల నిర్మాణాలకు ఆర్థిక సాయం చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో 298 జగనన్న లేఅవుట్లలో 30,985 మందికి ఇళ్లు మంజూరయ్యాయి. ఇవికాకుండా సొంత స్థలం ఉన్న వారికీ మరో 28,918 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 20 వేల మంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారి ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. జగనన్న లేఅవుట్లలో స్థలాలు పొంది నేటికీ ఇంటి నిర్మాణం ప్రారంభించని వారు జిల్లాలో 7,199 మంది ఉన్నారు. కూటమి ప్రభుత్వం తాజా నిర్ణయంతో వీరి పట్టాలన్నీ రద్దు కానున్నాయి.
అనుచరులకు కట్టబెట్టేందుకే
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలిచ్చారు. ప్రస్తుత కూటమి సర్కార్ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే కేవలం కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలకు మేలు చేసేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం జగన్ సర్కార్ పేదలకు ఇచ్చిన పట్టాలను రద్దు చేసి...వాటిని మళ్లీ తమ అనుచరులు, కార్యకర్తలకు ఇచ్చేందుకు సిద్ధమైంది.
అభివృద్ధి చేసిన లేఅవుట్లపై కన్ను
గత జగన్ ప్రభుత్వం జిల్లాలో జగనన్న లేఅవుట్లలో పేదలకు పట్టాలిచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. రోడ్లు, విద్యుత్ లైన్‌లు, నీటి సౌకర్యం లాంటి పనులు పూర్తి చేసింది. ఇలా అభివృద్ధి చేసిన లే అవుట్లలో స్థలాల విలువ అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం రూ.లక్షల్లో పలుకుతున్న ఆ స్థలాలను తమవారికి కట్టబెట్టేందుకు కూటమి నేతలు ప్లాన్ చేశారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించలేదన్న సాకుతో పట్టాలన్నీ రద్దు చేసేందుకు ప్రభుత్వం ద్వారా ఆదేశాలు ఇప్పిస్తున్నారు.
కొత్తవారికే పెంచిన సాయం!
గత ప్రభుత్వ హయాంలో ఇంటి నిర్మాణం ప్రారంభించిన చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో నిర్మాణాలు పూర్తి చేసుకోలేక పోయారు. జిల్లాలో 40 వేల మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కాగా కూటమి ప్రభుత్వం ఇంటి నిర్మాణాలకు చేసే ఆర్థిక సాయాన్ని రూ.4 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. దీంతో ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నవారంతా తమకూ సాయం అందుతుందని, ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని హాయిగా ఉండవచ్చని ఆనంద పడ్డారు. కానీ కూటమి ప్రభుత్వ పెద్దలు ఇందులో పెద్ద మెలిక పెట్టారు. ఇక నుంచి మంజూరు చేసే ఇంటి నిర్మాణాలకే పెంచిన మొత్తం వర్తిస్తుందని తేల్చి చెప్పారు. ఇళ్లు నిర్మించుకోలేని వారి పట్టాలు రద్దు చేసేందుకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం ఆ నిర్ణయం ఉపసంహరించుకుని, పెంచిన ఆర్థిక సాయం వర్తింపజేస్తే నిరుపేదలంతా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని, అలాకాకుండా కేవలం తమ వారికి మేలు జరిగేలా కూటమి ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజుల కిందట
కేబినెట్‌లో నిర్ణయం
ఇంటి పట్టాలు కోల్పోనున్న
వేలాది మంది నిరుపేదలు
వాటిని తమ మద్దతుదారులకు
ఇచ్చేందుకు స్కెచ్
నిరుపేదల సొంతింటి కలను భగ్నం చేస్తున్న ప్రభుత్వ పెద్దలు
Comments
Please login to add a commentAdd a comment