సర్వర్ సతాయింపు.. పింఛన్‌దారుల అగచాట్లు
పుట్టపర్తి అర్బన్: సర్వర్ సతాయించడంతో పింఛన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం నుంచీ పలుమార్లు అధికారుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడ్డారు. ఉదయం 11 గంటల వరకూ సర్వర్ సతాయించడంతో అటు సచివాలయ ఉద్యోగులూ, ఇటు పింఛన్‌దారులు పడరాని పాట్లు పడ్డారు. ఫిబ్రవరి నెలకు సంబంధించి జిల్లాలోని 2,63,908 మంది పింఛన్ లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.114.37 కోట్లు మంజూరు చేసింది. దీంతో శనివారం ఉదయమే గ్రామాలకు చేరుకున్న సచివాలయ ఉద్యోగులు పింఛన్ ఇచ్చేందుకు ప్రయత్నించగా, సర్వర్ పనిచేయలేదు. దీంతో ఉదయం 10 గంటల వరకూ వేచి చూసి ఆ తర్వాత సచివాలయాలకు వెళ్లిపోయారు. ఆ తర్వాత సర్వర్ పనిచేసినా ఇళ్ల వద్ద కాకుండా అందరినీ ఒకే చోటకు పిలిచి పంపిణీ చేశారు. దీంతో తొలిరోజు 2,51,297 మంది లబ్ధిదారులకు రూ.108.60 కోట్లు పంపిణీ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇంటర్ పరీక్షకు
12,785 మంది హాజరు
పుట్టపర్తి అర్బన్: ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం నిర్వహించిన ‘నైతికత, మానవ విలువలు’ పరీక్షకు జిల్లా నుంచి 12,785 మంది విద్యార్థులు హాజరైనట్లు ఇంటర్ విద్య జిల్లా అధికారి రఘునాథరెడ్డి తెలిపారు. జిల్లా నుంచి 13,134 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 349 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. పరీక్షను స్పెషల్ ఆఫీసర్ చెన్నకేశవ ప్రసాద్, పరీక్ష నిర్వహణ కమిటీ సభ్యులు సురేష్ బాబు, శ్రీరామరాజు, శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు.
విజయ శంకర్‌బాబుకు
అంతర్జాతీయ అవార్డు
బుక్కరాయసముద్రం: రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్‌బాబుకు అంతర్జాతీయ అవార్డు వరించింది. హైదరాబాద్‌లోని క్రీడాలో జనవరి 29 నుంచి 31 వరకు మెట్ట వ్యవసాయ పరిశోధనలపై అంతర్జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. వివిధ దేశాల నుంచి వర్చువల్‌గా శాస్త్రవేత్తలు, 1200 మంది విభిన్న రీతిలో అభివృద్ధి సాధించిన రైతులు హాజరయ్యారు. రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్‌బాబు 24 ఏళ్లుగా నేలల ఆరోగ్యం, సమగ్ర పోషణ యాజమాన్యం, తదితర మెట్ట వ్యవసాయ సంబంధిత పరిశోధనలు చేసినందుకు సదస్సులో అవార్డు అందజేశారు. ఈ అవార్డును ఐఎస్‌డీఏ ఫెలో ఇండియన్ కౌన్సిల్ అఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ వారు అంతర్జాతీయ అవార్డును భారత వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ డాక్టర్ హిమాన్షు పఠాక్, ఇక్రిషాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ స్టాండ్‌ఫర్డ్ బ్లెడ్ వారి చేతులు మీదుగా స్వీకరించారు. విజయ శంకర్‌బాబును ఆచార్య ఎన్జీరంగా వ్యసాయ పరిశోధన సంచాలకులు డాక్టర్ సత్యనారాయణ, రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం సిబ్బంది అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment