![నవంబర్‌లో సత్యసాయి శత జయంతి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06pty301-110024_mr-1738870912-0.jpg.webp?itok=tpLdvvsm)
నవంబర్‌లో సత్యసాయి శత జయంతి
ప్రశాంతి నిలయం: సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ చేతన్ తెలిపారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సత్యసాయి శత జయంతి ఉత్సవాల ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ శత జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారని, పొరపాట్లకు తావీయకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలన్నారు. విమానాశ్రయం, ఆర్టీసీ బస్టాండ్, చిత్రావతి నది సుందరీకరణ పనులు, మొబైల్ టాయిలెట్స్, రవాణా సేవలు, సురక్షితమైన తాగునీరు, మెడికల్ క్యాంపులు, పుట్టపర్తి పరిసరాలతో పాటు బెంగళూరు, చైన్నె, హైదరాబాద్ వంటి నగరాలను కలిపే జిల్లాలోని రహదారుల మరమ్మతుల కోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ధర్మవరం రైల్వేష్టేషన్, పుట్టపర్తి రైల్వేస్టేషన్‌లలో భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి మాట్లాడుతూ తాత్కాలిక ఆశ్రయాలు, వసతి, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలు, భక్తుల రాకకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రముఖుల రాక నేపథ్యంలో హెలిప్యాడ్‌లు, ప్రశాంతి నిలయం చేరుకునేందుకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ధర్మవరం రైల్వేస్టేషన్ నుంచి పుట్టపర్తికి బస్సు కనెక్టివిటీ పెంచేందుకు ప్రత్యేక బస్సులు వేయాలని కోరారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ సుమారు 10 లక్షల మంది భక్తులు జయంత్యుత్సవాల్లో పాల్గొంటారన్నారు. ప్రభుత్వ శాఖల అధికారులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్‌ను సమన్వయం చేసుకుని జయంత్యుత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ వి.రత్న, డీఆర్వో విజయ సారథి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు రోమెల్, చలం, షృష్టి, ఆర్‌అండ్‌బీ ఇంజినీర్ సంజీవయ్య, ఎస్‌సీపీఆర్ మురళీమోహన్, డీపీఓ సమత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశం
తీరని అధికార దాహం!
ప్రభుత్వ అధికారిక సమావేశాలు, సమీక్షలు ఏవైనా సరే ఆయన ప్రత్యక్షమవుతారు. ఆయనేమైనా ఉన్నతాధికారా.. ప్రజాప్రతినిధా అంటే కానే కాదు. ఓ మాజీ ప్రజాప్రతినిధి. రాజకీయ పార్టీ నాయకుడు. గతంలో ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్‌గా, మంత్రిగా పనిచేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు. సొంత పార్టీలోనే ఆయనపై అసమ్మతి రేగింది. దీంతో ఆయన కోడలుకు టికెట్ ఇచ్చారు. ఆమె గెలుపొందారు. ఎమ్మెల్యే హోదాలో ఆమె ఎక్కడ, ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఆమెతో సమ ప్రాధాన్యతగా అనధికారికంగా ప్రత్యక్షమవుతుంటారు. కోడలి చాటున పెత్తనం చెలాయిస్తున్న ఆయనపై పత్రికల్లో వచ్చినా తనకేమీ పట్టనట్టు.. తాను ప్రజల కోసం ఆ మాత్రం పని చేయక్కర్లేదా అని ఎదురుదాడికి దిగుతుంటారు. అంతే కాదు పార్టీ కార్యాలయంలోనే అధికారిక సమీక్షలు సైతం ఆయన నిర్వహిస్తుండడం గమనార్హం. ప్రజలు ఎన్నుకున్నది ఒకరిని అయితే అధికార దర్పం మరొకరు చూపిస్తుండడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా గురువారం సత్యసాయి శతజయంత్యుత్సవాలకు సంబంధించి కలెక్టర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన దర్జాగా ఆశీనులయ్యారు. ఆయన ఏ హోదాతో సమావేశానికి హాజరైనట్లు అంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment