కోళ్ల మరణాలపై అప్రమత్తం
అనంతపురం అగ్రికల్చర్: పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కోళ్ల అసాధారణ మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పశుసంవర్ధకశాఖ రెండు జిల్లాల జేడీలు డాక్టర్ జీపీ వెంకటస్వామి, డాక్టర్ జి.శుభదాస్, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ డాక్టర్ ఎన్.రామచంద్ర గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అధికారుల ఆదేశాల మేరకు గురువారం జిల్లాలో పలు ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫారాలు సందర్శించి కోళ్ల ఆరోగ్య స్థితిగతులు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా అలాంటి మరణాలు సంభవిస్తున్న దాఖలాలు లేవన్నారు. అనుమానిత ప్రాంతాలు, అవసరమైన చోట కోళ్ల నుంచి నమూనాలు సేకరిస్తున్నామన్నారు. ఎక్కడైనా అలాంటి అసాధారణ పరిస్థితులు ఉన్నట్లు గమనిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదించాలని సూచించారు. చనిపోయిన కోళ్లను ఖాళీ స్థలాలు, బావులు, వాగులు, రోడ్డు పక్కన పడేయకూడదని, కచ్చితంగా గుంత తీసి పాతిపెట్టి పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. అపోహలకు పోకుండా బాగా ఉడికించిన గుడ్లు, మాంసం తీసుకోవచ్చని పేర్కొన్నారు.
సెంట్రల్ యూనివర్సిటీ
రిజిస్ట్రార్‌గా షీలారెడ్డి
అనంతపురం: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ తొలి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ సి. షీలా రెడ్డి నియమితులయ్యారు. వివిధ వర్సిటీల్లో పనిచేస్తున్న 15 మంది ప్రొఫెసర్లు ఇంటర్వ్యూలకు హాజరుకాగా, ప్రొఫెసర్ సి. షీలా రెడ్డి రిజిస్ట్రార్‌గా ఎంపికయ్యారు. వర్సిటీ తొలి రిజిస్ట్రార్ ఆమే కావడం గమనార్హం. ప్రొఫెసర్ షీలారెడ్డికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ, అంబేడ్కర్ థాట్ అండ్ ఫిలాసఫీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంశాలపై మంచి పట్టు ఉంది. 2006 నుంచి 2011 వరకు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. శ్రీ వెంకటేశ్వర కళాశాల, యూనివర్సిటీ ఆఫ్ న్యూఢిల్లీలో ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. టీటీడీ నుంచి ఉత్తమ ఉద్యోగి అవార్డును అందుకున్నారు. నాణ్యమైన పరిశోధనలు, పాలనలో సమర్థత, విశేషమైన బోధనానుభవం ఉండడంతో రిజిస్ట్రార్‌గా షీలారెడ్డికి అవకాశం దక్కింది. కాగా, సెంట్రల్ యూనివర్సిటీ 2018లో అనంతపురంలో ఏర్పాటైంది. ప్రస్తుతం 17 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment