భీమిలి పోలీస్‌స్టేషన్ వద్ద విద్యార్థి బంధువులు
తగరపువలస: భీమిలి మండలం తాళ్లవలస నారాయణ స్కూల్‌లో 9వ తరగతి విద్యార్థి(14) ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని అతని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం జాడుపల్లికి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు హిమబిందు, గణేష్, పెద్దమ్మ దుర్గ, సర్పంచ్ కన్నబాబు తదితరులు శనివారం రాత్రి ఇక్కడకు చేరుకున్నారు. భీమిలి పోలీస్‌స్టేషన్ వద్ద ఆదివారం ఉదయం పెద్దమ్మ దుర్గ మాట్లాడుతూ ఆరు నెలలుగా స్కూల్ ఇన్‌చార్జి జగదీష్.. తమ బిడ్డను వేధిస్తున్నాడని ఆరోపించారు. అతను ఎలా చనిపోయాడో జగదీష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తన పేరులో మొదటి అక్షరం ‘ఎస్’ను చేతిపై రాసుకుంటే.. ఒక అమ్మాయి పేరు రాసుకున్నట్లు భావించి పలుమార్లు కొట్టారని ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం 2.30కు గణేష్‌కి ఫోన్ చేసినట్లు స్కూల్ యాజమాన్యం చెబుతోందని.. అయితే అతని ఫోన్ అందుబాటులో లేకపోవడంతో సాయంత్రం వరకు వివరాలు తెలియలేదన్నారు. తాము వచ్చేటప్పటికి తమ బిడ్డ మృతదేహాన్ని సంగివలస అనిల్ నీరుకొండ ఆస్పత్రి మార్చురీకి తరలించారన్నారు. ముమ్మాటికీ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం, కక్షపూరితమైన వ్యవహారం కారణంగానే తమ బిడ్డ చనిపోయాడని అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా.. స్కూల్‌కు చెందిన ఇద్దరు ప్రతినిధులు విద్యార్థి కుటుంబ సభ్యులతో ఉదయం నుంచి భీమిలి పోలీస్ స్టేషన్ వద్ద మంతనాలు సాగించారు. విద్యార్థి మృతదేహానికి పోస్టుమార్టం చేసి తీసుకువెళ్లాలని ప్రాధేయపడుతున్నట్టు తెలిసింది. ఆదివారం సాయంత్రం వరకు ఈ విషయం ఓ కొలిక్కి రాలేదు. భీమిలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment