ఎచ్చెర్ల క్యాంపస్: సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రం నిర్వహణకు సంబంధించి పలు భవనాలను కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ మంగళవారం పరిశీలించారు. చిలకపాలేంలోని శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు బ్లాక్‌లను పరిశీలించారు. 2014, 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పది నియోజక వర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు, స్ట్రాంగ్ రూమ్‌లు ఇక్కడే నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ఎస్పీ జీఆర్ రాధికలతో కూడిన అధికారులు మొత్తం భవనాలు పరిశీలించి, ఏర్పాట్లపై సమీక్షించారు. ఇదే క్యాంపస్ ఆవరణలో ఉన్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం అద్దె క్యాంపస్‌ను కూడా పరిశీలించారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ కౌంటింగ్‌పై కోర్టులో కేసు ఉన్నందున ఒక బ్లాక్ ఈవీఎంలతో ఉంది. పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో ఎనిమి ది నియోజక వర్గాలకు సంబంధించి కౌంటింగ్, స్ట్రాంగ్ రూంలు, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, డిపాజిట్ సెంటర్‌లు నిర్వహణ, పోస్టల్ బ్యాలెట్ బూత్‌ల ఏర్పాటు వంటి అంశాలకు సంబంధించి అధికారులతో చర్చించారు. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిశీలించారు. ఇక్కడి భవనాలు పరిశీలించి, పూర్తిస్థాయిలో భవనాల వివరాలు నివేదిక కోరారు. వర్సిటీలో కౌంటింగ్ కేంద్రాలు సామర్థ్యంపై వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కేఆర్ రజినీతో చర్చించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సీహెచ్ గంగయ్య, ఎచ్చెర్ల నియోజకవర్గం ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ బి.పద్మావతి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బాలరాజు, ఎచ్చెర్ల తహశీల్దార్ వి.శ్యాంకుమార్, ఎచ్చెర్ల ఎస్‌ఐ చిరంజీవి, శివానీ కళాశాల యాజమాన్య ప్రతినిధులు దుప్పల వెంకటరావు, పెనుమత్స దుర్గాప్రసాద్ రాజు, శివానీ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment