గంజాయి అక్రమ రవాణాలో..
శ్రీకాకుళం క్రైమ్:
జిల్లాలో గంజాయి సాగు లేకపోయినా క్రయవిక్రయాలకు, అక్రమ రవాణాకు మాత్రం అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎదురుగా పోలీసులున్నా సరే.. వారిని దాటించి తప్పించుకుపోవడమో.. లేదంటే వారి వాహనాన్ని ఢీకొట్టి పరారు కావడమో వంటి ఘటనలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ కాలేజీ గ్రౌండ్‌లో పాడుబడిన వసతిగృహ భవనంలో యువత గంజాయి వంటి అసాంఘిక కార్య కలాపాల్లో పాల్గొంటున్నారని, దృష్టి పెట్టండంటూ ఓ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఇటీవల ఎస్పీ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. శాంతిభద్రతల విషయంలో తలనొప్పిగా ఉన్న కాశీబుగ్గ డివిజన్ కేంద్రంలో ఇద్దరు బాలికలపై మత్తులో ఉన్న యువకులు లైంగిక దాడికి పాల్పడటం విదితమే. జిల్లా కేంద్రంలో ఇటీవల పదుల సంఖ్యలో మత్తుకు బానిసైన యువకులను, మైనర్లను పోలీసులు జల్లెడ వేసి పట్టుకున్నారు. ఈ ఘటనలు బట్టి చూస్తే జిల్లాలో అధిక సంఖ్యలో యువత గంజాయికి బానిసలుగా మారారన్నది తేటతెల్లమవుతోంది.
ఒక్క ఏడాదిలో 39 కేసులు..
ఈ ఏడాది సుమారు 39 గంజాయి కేసుల్లో 113 మంది అరెస్టయ్యారు. 1137 కిలోలకు పైగా గంజాయి పట్టుబడింది. గత రెండు నెలలుగా చూస్తే 20కు పైగా కేసుల్లో సుమారు 880 కిలోలు అక్రమ రవాణాలో దొరికింది. ఇక పోలీసుల కన్నుగప్పి దాటినది ఎంతుంటుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఒడిశా గార బంద నుంచి పలాస హైవేపైకి వచ్చిన ఓ కంటైనర్ లారీలో భారీస్థాయిలో గంజాయి తరలిస్తున్న సమాచారం మేరకు వేకువజామున అడ్డుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఢీకొట్టి వెళ్లిపోయారు. విశాఖలో ఆ లారీ పట్టుబడింది. ఇటీవల ఒడిశా నుంచి పాతపట్నం జాడుపల్లి మీదుగా భారీగా గంజాయి తరలిస్తూ పోలీసులకు కనిపించడంతో ఓ యువకున్ని ఢీకొట్టి గంజాయి ఉన్న బొలెరోను వదిలి ఒడిశా ముఠా పరారైన సంగతి తెలిసిందే.
యువత బలవ్వాల్సిందేనా..?
జిల్లాలో గంజాయి సాగు సంగతి పక్కన పెడితే.. పక్క రాష్ట్రం ఒడిశా నుంచి రెండు ప్రధాన చెక్‌పోస్టులు(పురుషోత్తపురం, పాతపట్నం) దాటి అక్రమంగా రవాణా అవుతోంది. దీంతో యువత బానిసలుగా మారుతున్నారు. సకాలంలో గంజాయి ప్యాకెట్లు దొరక్కపోతే టైర్లకు అంటించే గమ్‌ను కవర్లలో పెట్టి గంజాయిలా పీల్చే స్థితికి దిగజారిపోయారు. ఈ క్రమంలోనే నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కొందరు ఒడిశా వ్యాపారులు ఇచ్చే కమీషన్ కోసం అదే గంజాయి సరఫరా చేయడం, క్రయ విక్రయాల్లో పాల్గొనడం చేస్తూ బంగారు భవితను నాశనం చేసుకుంటున్నారు.
దాడులు జరుపుతున్నా..
పోలీసులు విస్తృతంగా దాడులు జరుపుతున్నా గంజాయి జిల్లాలోకి రాకుండా మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. డ్రోన్ సర్వేలు, కైనెన్ డాగ్స్ పరిశీలన చేయడంతో పాటు తరచూ యువతకు అవగాహన సదస్సులు నిర్వహిస్తే కొంత ఫలితం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఒడిశాలో సాగు.. జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు తరలింపు
ఈ క్రమంలోనే మత్తుకు బానిసలుగా మారుతున్న జిల్లా యువత
ఒడిశా కేంద్రంగా..
తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్(సూరత్).. తరలించే ప్రాంతమేదైనా ఒడిశానే కేంద్రం. సరిహద్దు చెక్‌పోస్టులు దాటి సిక్కోలు హైవేనే మార్గం. క్రయ విక్రయాలు జరిపేవారు, సేవించేవారు మన జిల్లావారే పట్టుబడుతున్నా ‘సరుకు’ అందించే మూలాలన్నీ ఒడిశావే. మన పోలీసుల రికార్డుల్లో 56 మంది పరారీలో ఉన్నట్లు తెలిసిందే. వీరిలో పదిమందిని ఇటీవల పట్టుకున్నారు. మిగిలిన 46 మంది ఒడిశా (అధికంగా), మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు తదితర ఇతర రాష్ట్ర ముఠాలకు చెందిన వారే.
Comments
Please login to add a commentAdd a comment