కూటమి దెబ్బ
మహిళా మార్టుకు..
మరిన్న సరుకులు పెట్టాలి..
నేనెప్పుడూ ఇక్కడే సరుకులు కొంటున్నాను. సరుకులు బాగుంటున్నాయి. ధర కూడా ఇతర మార్టులతో పోల్చితే తక్కువగా ఉంటుంది. ప్రతి వస్తువునూ మార్కెట్ కంటే తక్కువ ధరకే ఇస్తున్నారు. గడిచిన రెండేళ్లుగా ఇక్కడికే వస్తున్నా. మరిన్ని సరుకులు పెట్టాలి.
– లక్ష్మి, హడ్కో కాలనీ
అభివృద్ధి చేస్తాం..
మార్టులో గతంలో అవకతవకలు జరిగాయి. ప్రస్తుతం సాంకేతిక కారణాలు వల్ల వ్యాపా రం తగ్గింది. డీఆర్‌డీఏ అధికారులకు దృష్టికి తీసుకువెళ్లి మళ్లీ అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఇటీవల రూ.5 లక్షల సరుకులు తీసుకువచ్చాం. – పుచ్చల కల్పన,
ఎంఎంఎస్ అధ్యక్షులు, నరసన్నపేట
అమ్మకాలు పెంచుతాం...
ప్రస్తుతం అన్ సీజన్ కారణంగా సేల్స్ తగ్గాయి. మళ్లీ అమ్మకాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గడిచిన రెండు నెలలుగా మార్టులో బదిలీలు, స్టాఫ్ మారడం వల్ల అమ్మకాలపై దృష్టి పెట్టలేక పోయాం. ఇక నుంచి చర్యలు తీసుకుంటాం. – కొండలరావు, ఏసీ, నరసన్నపేట
నరసన్నపేట: మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ఏర్పాటైన మహిళా మార్టులు తిరోగమనంలో పయనిస్తున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో లక్షలాది రూపాయల వ్యాపారంతో కళకళలాడిన మార్టులు కూటమి ప్రభుత్వం వచ్చాక నష్టాలను చవిచూస్తున్నాయి. రోజూ వేలాది రూపాయలు జరిగే ఈ స్టోర్లలో నేడు కనీస స్థాయిలో కూడా వ్యాపారం జరగక నిర్వాహకులు దిగాలు చెందుతున్నారు. దీనంతటికీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక జిల్లాలో ఇతర పట్టణాల్లో మహిళా మార్టుల విస్తరణ పూర్తిగా మరుగునపడిపోయింది. 2022 డిసెంబర్ 14న నరసన్నపేటలో మహిళా మార్టును ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ప్రభుత్వం, సెర్ప్, డీఆర్‌డీఏ అధికారులు ప్రతిష్టాత్మకంగా భావించి మార్టుల నిర్వహణకు ప్రాధాన్యమిచ్చారు. మంచి వ్యాపారం చేపట్టి రాష్ట్రంలోనే నరసన్నపేట మార్టు ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పటి వరకూ రూ.3.94 కోట్లు టర్నోవర్ సాదించింది. పది మంది వరకూ మహిళలు ఇక్కడ పనిచేసేవారు.
మొక్కుబడిగా నిర్వహణ...
మహిళా మార్టులో గతంలో రోజుకు రూ.40 వేల నుంచి లక్ష రూపాయల పైబడి వ్యాపారం జరిగేది. దీంతో పాటు మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారయ్యే ఉత్పత్తుల విక్రయాలు కూడా ఇక్కడే జరిగేవి. తద్వా రా ప్రజలకు నాణ్యమైన సరుకులు సరసమైన ధరలకు అందేవి. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మార్టు కావడం వల్ల ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి భిన్నంగా తయారైంది. అధికారుల పర్యవేక్షణ కొరవడటం, కొనుగోలు లక్ష్యాలు విధించకపోవడంతో ప్రస్తుతం రోజుకు ఐదారు వేలు వ్యాపారం కూడా జరగడం లేదు. గడిచిన రెండు నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పర్యవేక్షణ లేక మొక్కుబడిగా మార్టు నిర్వహిస్తున్నారు. ముగ్గురు మాత్రమే సిబ్బంది ఉన్నారు. మొదట్లో ఉన్న సిబ్బందిని తొలగించి కొత్తవారిని నియమించారు. ప్రస్తుతం మార్టు నష్టాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆడిట్‌లో నిర్థారణ అయినట్లు తెలుస్తోంది. ఐకేపీ అధికారులు విక్రయాల్లో రాష్ట్రంలో మొదటి పది స్థానాల్లో ఉండే నరసన్నపేట మహిళా మార్ట్ ప్రస్తుతం నష్టాల్లో పయనిస్తోంది. నరసన్నపేట మండలంలో 1998 మహిళా సంఘాలు ఉండగా దీంట్లో 24.512 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 22,500 మంది నుంచి మహిళా మార్టు కోసం రూ.110 వసూలు చేశారు. వీరందరికీ షేర్ ధనం రూపేన భాగసామ్యం కల్పించారు. ప్రస్తుతం ఈ షేర్ ధనం కూడా మాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు మార్టు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
2024 అమ్మకాలు ఇలా..
సెప్టెంబరు రూ. 15.71 లక్షలు
అక్టోబరు రూ. 8.48 లక్షలు
నవంబర్ రూ.3.16 లక్షలు
2023లో అమ్మకాలు ఇలా..
సెప్టెంబరు రూ.28.42 లక్షలు
అక్టోబరు రూ.26.27 లక్షలు
నవంబరు రూ.29.63 లక్షలు
నాడు రూ.లక్షల్లో వ్యాపారం
నేడు నష్టాల దిశగా పయనం
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
జిల్లాలో ఇతర పట్టణాల్లో విస్తరణకు తూట్లు
అయోమయంలో మహిళా సంఘాలు
Comments
Please login to add a commentAdd a comment