ఎంవీపీకాలనీ: గాయత్రీ విద్యా పరిషత్ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ చదువుతున్న సామినేని శిరీష(22) ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై ఎంవీపీ పోలీసులు తెలిపిన వివరాలివి.. శ్రీకాకుళం జిల్లా పొందూరుకు చెందిన శిరీష ఎంటెక్ అభ్యసించేందుకు నగరానికి వచ్చింది. ఎంవీపీ కాలనీలో తన అక్కాబావల వద్ద ఉంటూ చదువుకుంటోంది. అదే గ్రామానికి చెందిన దిలీప్‌తో ఆమెకు వివాహం జరగడంతో, వారం వారం పొందూరు వెళ్లి వస్తోంది. కాగా చదువు మధ్యలోనే పెళ్లి చేయడం, ఇటీవల తండ్రి మరణించడంతో ఆమె మనస్తాపానికి గురైంది. అలాగే వ్యవసాయ నేపథ్యం ఉన్న దిలీప్‌తో పెళ్లి చేయడం కూడా శిరీషకు ఇష్టం లేనట్లు తెలిసింది. బుధవారం ఆమె అక్కాబావ వివాహ కార్యక్రమం కోసం వేరే ఊరు వెళ్లారు. దీంతో శిరీష ఒక్కతే ఇంట్లో ఉంది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు చాలాసార్లు ఆమె ఫోన్‌కు కాల్ చేసినా శిరీష స్పందించకపోవడంతో కంగారుపడి, తెలిసిన వారికి సమాచారం ఇచ్చారు. వారు ఇంటి కిటికీ నుంచి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు ఆమె మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఆమె తల్లి రమణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె రాత్రి ఎవరితో మాట్లాడింది? ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయాలు దర్యాప్తులో తేలుతాయని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment