శిశువు మృతిపై బంధువుల అందోళన
టెక్కలి రూరల్: స్థానిక జిల్లా ఆస్పత్రిలో బుధవారం వేకువజామున శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అందోళనకు దిగారు. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. నందిగాం మండలం గోకర్నపల్లి గ్రామానికి చెందిన పి.శ్రావణి అనే గర్భిణి మంగళవారం టెక్కలి జిల్లా ఆస్పత్రికి ప్రసవం నిమిత్తం వచ్చింది. అయితే ఆస్పత్రిలో జాయిన్ అయ్యాక బుధవారం వేకువజామున పురిటినొప్పులు రావడంతో అమెకు సాధారణ ప్రసవం చేసేందుకు వైద్యులు ప్రయత్నించారు. దీంతో మహిళ మగబిడ్డకు జన్మనివ్వగా ఆ బిడ్డ అప్పటికే అస్వస్థతకు గురై అనంతరం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న శిశువు కుటుంబ సభ్యులు బిడ్డ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆందోళన చేపట్టారు. వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే తమ బిడ్డ బతికేవాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై వైద్యురాలు ధనలక్ష్మిని వివరణ అడగగా శ్రావణికి నొప్పులు వచ్చినప్పటి నుంచి ఇద్దరు వైద్యులు దగ్గరుండి ప్రసవం చేశామని, అయితే ఆ పిల్లవాడి మెడకు పేగు చుట్టుకుపోవడం వలన ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. తాము ఎటువంటి నిర్లక్ష్యం వహించలేదని పేర్కొన్నారు. అనంతరం గర్భిణీ కుటుంబ సభ్యులు కొంత సమయం తర్వాత ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment