నీట మునిగిన పంటలు.. | - | Sakshi
Sakshi News home page

నీట మునిగిన పంటలు..

Published Thu, Dec 26 2024 1:14 AM | Last Updated on Thu, Dec 26 2024 1:14 AM

నీట మ

నీట మునిగిన పంటలు..

10 బస్తాలూ కష్టమే..

రెండున్నర ఎకరాల భూమిలో వరి కోతకు సిద్ధం కాగా వాతావరణం మార్పులతో ఇప్పుడే కోత వద్దని అధికారులు చెప్పారు. ఆ తర్వాత పది రోజులు వాతావరణం సహకరించలేదు. వర్షం, గాలులతో పంట నేలకొరిగింది. తొలుత 70 బస్తాలు ధాన్యం వస్తుందని అంచనా వేయగా.. ఇప్పుడు 10 బస్తాలు కూడా వచ్చే అవకాశం లేదు. బాగా నష్టం వాటిల్లింది.

– గొబ్బక రామలింగేశ్వరరావు, రైతు, జయలక్ష్మి నగర్‌, నరసన్నపేట

ధాన్యం తీసుకోవడం లేదు

ఎకరా పైబడి వరి ఓవులు కష్టపడి ఒడ్డుకు తీసుకొచ్చి నూర్పు చేశాను. రైసు మిల్లుకు ధాన్యాన్ని పంపించగా తేమ ఎక్కువ ఉందని మిల్లరు తీసుకోవడంలేదు. దీంతో ట్రాక్టర్‌పై ధాన్యం బస్తాలు ఉంచాను. ఎండలు వచ్చాకే ఆరబెడతాను. మరో మూడు ఎకరాలు పంట నీటిలోనే ఉంది. ఉప్పు నీరు కొట్టినా, కిందిభాగం అంతా మొలకలు వచ్చేస్తున్నాయి. అధికారులు దృష్టిసారించి ధాన్యం తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. – మల్ల వెంకటసన్యాసి నాయుడు, రైతు, బూరవెల్లి, గార మండలం

ప్రభుత్వం ఆదుకోవాలి

వర్షాలు కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి. రబీలో సాగు చేస్తున్న మొక్కజొన్న, పెసర, మినుము పంటలతో పాటు కూరగాయల పంటలకు నష్టం జరిగింది. ఇంకా పొలాల్లోనే వర్షం నీరు నిలిచి ఉంది.

– గొండు సూర్యనారాయణ, కూరగాయల రైతు, పెద్దకోట, ఎల్‌.ఎన్‌.పేట

ఆశలు ఆవిరి..

ఖరీఫ్‌ చివరిలో వర్షాలు అనుకూలించకపోగా పంటలు ఎండిపోయాయి. చేతికందిన కొద్దిపంట ఇప్పుడు వర్షాల కారణంగా తడిచిపోయింది. ఈ ఏడాది ధాన్యం రాశులతో సంక్రాంతి పండుగను సందడిగా చేద్దామనుకున్నాం. ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయి.

– బాలక కనకరాజు, రైతు, పాతటెక్కలి

సోంపేట: బెంకిలిలో నేలకొరిగిన వరి పంట

● నెల రోజులుగా కురుస్తున్న వర్షాలు

● రెండు అల్పపీడనాలు, తుఫాన్‌, వాయుగుండంతో అన్నదాతల్లో అలజడి

● పంటను కాపాడుకోవడానికి రైతన్నల అవస్థలు

● నిబంధనలతో నష్ట పరిహారం రాదని తెలిసి మరింత ఆందోళన

● పాలకులకు పట్టని కర్షకుల ఇక్కట్లు

పంట చేజారింది..

ఇరవై రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలులతో తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులకు ముందస్తు సమాచారం సరైన పద్ధతిలో చేరకపోవడంతో పంటను కాపాడుకోలేకపోయారు. అధికారులు వెంటనే సర్వే చేయించి నష్ట పరిహారం అందించాలి. మా భూమిలో ఎకరానికి పైగా వరి పంట తడిచిపోయింది.

– బమ్మిడి శ్రీనివాసరావు, రైతు, తాళ్లభద్ర, పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ

పంటలు నాశనం..

మెట్టుప్రాంతాల్లో సాగు చేస్తున్న పెసర, మినుము పంటలపై ఏటా మంచి ఆదాయం వచ్చేది. ఈ సారి ఎడతెరిపి లేని వర్షాలు మా పంటలను నాశనం చేశాయి. సుమారు 90 వేల రూపాయల నష్టం వాటిల్లింది.

– మీసాల సూరిబాబు, రైతు, పెంట, జి.సిగడాం మండలం

జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో చాలాచోట్ల వరి కోతలు జరగలేదు. నెల రోజులుగా వర్షాలు పడుతూనే ఉండటంతో కోత కోసేందుకు రైతులు ధైర్యం చేయలేకపోయారు. దీంతో పలుచోట్ల పంట నేలకొరిగింది. మరికొన్ని పొలాల్లో నీరు చేరడంతో వరి పంటను రక్షించుకునేందుకు తిప్పలుపడుతున్నారు. కుప్పల చుట్టూ నీరు నిలిచిపోయింది. కల్లాల్లోని ధాన్యం తడిచిపోవడంతో ఆరబెట్టడానికి అవస్థలు తప్పడం లేదు. తడిసిన వరి పనల నుంచి మొలకలు వస్తున్నాయి. పలుచోట్ల ధాన్యం గింజలు మొలకెత్తుతున్నాయి. మరికొన్ని చోట్ల రంగుమారిపోతున్నాయి. మిగతా నియోజకవర్గాల్లో మరో దుస్థితి నెలకొంది. జిల్లాలో ఇప్పటికే 5వేల హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఎన్యుమరేషన్‌ పూర్తయితే ఇంకెంత నష్టం వెలుగు చూస్తుందో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడింది.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :

నెల రోజులుగా కురిసిన వర్షాలు అన్నదాతకు తీవ్ర నష్టం చేకూర్చాయి. రెండు అల్ప పీడనాలు, ఫెంగల్‌ తుఫాన్‌, వాయుగుండంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు రైతులను నిండా ముంచేశాయి. నవంబర్‌ 26న ప్రారంభమైన వర్షాలు డిసెంబర్‌ 26వ తేదీవరకు పడుతూనే ఉండటంతో కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. పంట చేతికి వస్తోందని ఆనందపడేలోపే వర్షాలు కర్షకుల గుండెల్లో అలజడి రేపాయి.

విచిత్రకర పరిస్థితులు..

● ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు సాధారణ వర్షపాతం 20,893.2 మిల్లీమీటర్లు కాగా 23,760.4 మిల్లీమీటర్ల వర్షం పడింది.

● అక్టోబర్‌లో 5769.3 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కాగా, 1186.2 మిల్లీమీటర్లు కురిసింది.

● నవంబర్‌లో సాధారణ వర్షపాతం 2977.1మిల్లీమీటర్లు కాగా, 213.4మిల్లీమీటర్లు పడింది. అంటే ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలో బాగా పడగా ఆ తర్వాత వర్షాలు తక్కువ పడ్డాయి.

● పంట కీలక దశలో తక్కువ వర్షపాతం నమోదు కాగా అవసరం లేని సమయంలో అంటే నవంబర్‌ చివరి వారం నుంచి డిసెంబర్‌ వరకు అధిక వర్షాలు పడ్డాయి. ఇప్పుడీ వర్షాలే రైతుల కొంప ముంచాయి.

● ముఖ్యంగా డిసెంబర్‌లో సాధారణ వర్షపాతం 83.4 మిల్లీమీటర్ల వర్షం కాగా ఈ నెల 25వ తేదీ వరకు 2937.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీన్నిబట్టి అవసరం లేని సమయంలో.. ముఖ్యంగా పండిన పంటను కోత కోసి విక్రయించడమో, దాచుకోవడమో చేసుకోవల్సిన సమయంలో దంచి కొట్టిన వర్షాలు రైతుల్ని నట్టేట ముంచేశాయి.

పాలకుల నిర్లక్ష్యం..

జిల్లాలో నవంబర్‌ మొదటి వారంలోనే వరి కోతలు ప్రారంభమయ్యాయి. 15వ తేదీకొచ్చేసరికి 50 శాతం కోతలైపోయాయి. నవంబర్‌ చివరికొచ్చేసరికి 70 నుంచి 80 శాతం కోతలయ్యాయి. సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందుగా అప్రమత్తమవ్వాలి. కొనుగోలు కేంద్రాలు తెరిచి ధాన్యం కొనుగోళ్లు చేయాలి. కానీ, కూటమి ప్రభుత్వానికి ఆరంభంలో పట్టలేదు. ఇతర వ్యవహారాలపై దృష్టి పెట్టి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయలేదు. నవంబర్‌లో ప్రారంభించాల్సిన కొనుగోలు కేంద్రాలు డిసెంబర్‌ మొదటి వారం వరకు ప్రారంభించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇంతలో వర్షాలు మొదలుకావడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.

నిబంధనలతో ఆందోళన..

ప్రస్తుతం సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల కొందరు రైతులు నష్టపోగా, వర్షాలు కారణంగా మరికొందరు నష్టపోయారు. ఇప్పటికే కోతలు కోసిన రైతులు వరి పనలను పొలాల్లోనే వదిలేశారు. మరికొందరు కుప్పలు వేశారు. వర్షాలకు ఇవి కూడా మునిగిపోతున్నాయి. వీటిని అధికారులు పంట నష్టం కింద పరిగణించరని తెలిసి రైతులు కలత చెందుతున్నారు. ఇక, కోయని వరి పంట నీటిలో మునిగిపోయి 35 శాతానికి పైగా కుళ్లిపోతేనే నష్టం జరిగినట్టు అంచనా వేస్తారని అధికారులు చెబుతున్నారు. దీంతో పంట కోయని రైతులు లబోదిబోమంటున్నారు. నిబంధనల ముసుగులో నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో రబీ సీజన్‌లో మొక్కజొన్న, అపరాలు, పెసర, మినుమ వేయగా వేరుశనగ, బొప్పాయి, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తుంటారు. ఇప్పటికే చాలాచోట్ల వేసేశారు. అయితే, మొక్కదశలోనే వర్షాలు పడటం, నీరు నిల్వ ఉండటంతో ఆ పంటలు కూడా కుళ్లిపోతున్నాయి.

గార :నీటమునిగిన వరి పనలను గట్టుపైకి తీసుకొస్తున్న రైతు

పంట దిగుబడి అంచనా 7,24,667 మెట్రిక్‌ టన్నులు

జిల్లాలో ఈ ఏడాది సాగైన విస్తీర్ణం3,60,325 ఎకరాలు

సేకరణ లక్ష్యం

5 లక్షల మెట్రిక్‌ టన్నులు

అన్నదాత

ఆక్రందన

అన్నదాతను పట్టించుకునేదెవరు..

వర్షాలతో రైతులు అవస్థలు పడుతున్నా కూటమి నేతలకు పట్టడం లేదు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం లేదు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయడంలో తమదైన పాత్ర పోషించలేదు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తం చేయడంలోనూ, పండిన పంటను దాచుకునేందుకు అవసరమైన టార్పాలిన్లు తదితర సమకూర్చే విషయంలో విఫలమయ్యారు. ఇక, అధికారులు కూడా రైతులకు పూర్తిస్థాయిలో జాగ్రత్తలు చెప్పడం లేదు. సాధారణంగా వర్షాలతో పనల మీద ఉన్న వరి నష్టపోకుండా లీటర్‌ నీటిలో 5 శాతం ఉప్పు కలిపిన ద్రావణంతో (50 గ్రాములు లీటరు నీటికి) పనలపై పిచికారీ చేస్తే గింజ మొలకెత్తకుండా ఉంటుంంది. ఇప్పటికే వేసిన కుప్పలలో గింజ మొలకెత్తకుండా, ధాన్యం రంగు మారకుండా 25 కిలోల గళ్లు ఉప్పు, 25 కిలోల ఊక కలిపి కుప్పలపై చల్లితే ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాలను రైతులకు నేరుగా తెలియజేసే ప్రయత్నం కొరవడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
నీట మునిగిన  పంటలు..1
1/7

నీట మునిగిన పంటలు..

నీట మునిగిన  పంటలు..2
2/7

నీట మునిగిన పంటలు..

నీట మునిగిన  పంటలు..3
3/7

నీట మునిగిన పంటలు..

నీట మునిగిన  పంటలు..4
4/7

నీట మునిగిన పంటలు..

నీట మునిగిన  పంటలు..5
5/7

నీట మునిగిన పంటలు..

నీట మునిగిన  పంటలు..6
6/7

నీట మునిగిన పంటలు..

నీట మునిగిన  పంటలు..7
7/7

నీట మునిగిన పంటలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement