పడతుల గళమున..
● గోదా గోష్టి పేరుతో శ్రీకూర్మంలో మహిళల నగర సంకీర్తన
● కూర్మనాథ స్వామి తిరువీధి
మార్గంలో నిర్వహణ
గార: ఆదికూర్మ క్షేత్రంలో ఆడపడుచుల గళములు స్వామికి స్వరార్చన చేస్తున్నాయి. ధనుర్మాసంలో మహిళలంతా ప్రతి రోజూ వేకువజామున నిర్వహించే మేలుకొలుపునకు 39 ఏళ్లు పూర్తయ్యాయి. గోదాగోష్టి పేరుతో మహిళలే ఈ క్రతువు నిర్వహిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం శ్రీవిల్లి పుత్తూరులో గోదాదేవి శ్రీకృష్ణున్ని ప్రసన్నం చేసుకునేందుకు మేలుకొలుపు జరిపి, గోపికలను సమాయత్తం చేసినట్టు పురాణాల మాట. ఆ మాదిరిగానే శ్రీవైష్ణవ సంప్రదాయ పరంపరగా ఉన్న శ్రీకూర్మనాథ క్షేత్రంలో సరిగ్గా 39 ఏళ్ల కిందట తిరువెంగళమ్మ (గురువమ్మ), దేవాలయం అప్పటి స్థానాచార్యు లు శ్రీభాష్యం రామప్పలాచార్యులు సతీమణి అనంత లక్ష్మమ్మలు వీటిని ప్రారంభించారు. తొలుత నలుగురు, ఐదుగురుతో మొదలైన ఈ కార్యక్రమంలో ఇప్పుడు యాభై మందికిపైగా పాలు పంచుకుంటున్నారు. గురువమ్మ కుమార్తె లక్ష్మమ్మ కొన్నాళ్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా, వైష్ణవ పరంపరంలో భాగంగా ఇప్పటి అధ్యాపకులు టీపీ శ్రీనివాసాచార్యులు సతీమణి సుశీలరాణి శ్రీకృష్ణుని చిత్రపటంతో నడువగా, ప్రతి ఇంటి వద్ద హారతులిస్తూ మేలుకొలుపు జరుగుతోంది. భక్తులిచ్చే నైవేద్యాలతో ఆలయంలోకి చేరుకొని స్వామికి హారతిస్తారు. ఆలయంలో ధనుర్మాసోత్సవంలో భాగంగా జరిగే గోదాదేవి, చక్రపెరుమాళ్ జరిగే బేడాసేవలో పాల్గొంటారు. మేలుకొలుపు ద్వారా వచ్చిన డబ్బులను ఆలయంలో జరిగే గోదా రంగనాథుల కల్యాణోత్సవాన తాళి బొట్టు, నూతన వస్త్రాలు, ప్రసాదానికి వినియోగిస్తారు.
సంకల్ప బలమే..
సంకల్ప బలం ద్వారానే ఇంత బాగా జరుగుతోంది. గోదా దేవి చేసిన మాదిరిగానే నిడువ బొట్టు పెట్టుకొని ఈ వ్రతంలో పాల్గొంటున్నాను. వేకువజామున కచ్చితంగా ఐదు గంటలకే ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొని చివరి వరకు ఉంటాను.
– సింహాద్రి మీనాక్షి, శ్రీకూర్మం
వర్షాలు పడినా ఆపలేదు
ఒక్కో ఏడాది భారీ వర్షాలు పడినా గోదాగోష్టి ఆపలేదు. గాలులు వీచినా, మంచు కురుస్తున్నా ఈ వ్రతంలో పాల్గొంటున్నాం. ప్రతి ఇంటి నుంచి పెద్ద పండితులు కూడా వచ్చి శ్రీకృష్ణునికి హారతులిచ్చి, ప్రసాదాలు సమర్పిస్తారు.
– కస్పా సరస్వతి, శ్రీకూర్మం
Comments
Please login to add a commentAdd a comment