డేంజర్ బెల్స్
పొందూరులో పెరుగుతున్న డయేరియా కేసులు
● పరిశుభ్రత లోపమే కారణమంటున్న అధికారులు
పొందూరు: పొందూరులో డయేరియా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. స్థానిక కస్పావీధి దానికి ఆను కుని ఉన్న ప్రాంతాల్లో డయేరియా రోగులు రోజు రోజుకూ పెరుగుతున్నారు. మంగళవారం మరో ఐదుగురు రోగులకు వ్యాధి సోకడంతో పొందూరు ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిలో చేరారు. వారిలో అనకాపల్లి రాము(48)కు వాంతులు, విరేచనాలు, ఆయాసం ఎక్కువగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మరొకరికి తగ్గుముఖం పట్టడంతో ఇంటికి చేరుకున్నారు. మరో ముగ్గురు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డయేరి యా వ్యాపించిన వీధుల్లో బోరు బావులు, నూతులవద్ద తాగునీటి సరఫరాను నిలిపివేసి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. తాడివలస పీహెచ్‌సీ వైద్యులు రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో పీహెచ్‌సీ సిబ్బది రోగులకు ఇంటి వద్ద చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ఎంపీడీఓ మన్మధరావు పరామర్శించారు.
బాధితులకు పరామర్శ
డయేరియా సోకిన రోగులను, కుటుంబాలను జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య మంగళవారం పరామర్శించారు. వీధుల్లో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. తాగునీటి వనరుల్లో ఎలాంటి కలుషితం లేదని ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రాజు డీపీఓకు తెలిపారు. ల్యాబ్‌లలో నిర్వహించిన నీటి పరీక్షల రిపోర్టులను డీపీఓకు అందించారు. దీంతో వ్యక్తిగత, సామాజిక పరిశుభ్రత లేకపోవడమే వ్యాధి తీవ్రతకు కారణమని డీపీఓ గుర్తించారు. నాలుగు రోజుల పాటు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని ఈఓ మోహన్‌బాబును ఆదేశించారు. వీధులలో తిరిగి పరిసరా ల పరిశుభ్రతను పరిశీలించి పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. వ్యాధి తీవ్రతపై వైద్యులతో మాట్లాడారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆరోగ్య, పంచాయతీ అధికారులతో చర్చించారు.
మాంసం, చేపల విక్రయాలపై నిషేధం
పొందూరులో సోమవారానికి 15 మంది డయేరియా రోగులు ఉండగా, మంగళవారానికి మరో ఐదుగురు పెరిగారు. వ్యాధి తగ్గుముఖం పట్టకపోవడంతో పంచాయతీ అధికారులు పొందూరులో చేపలు, మాంసం విక్రయాలపై నిషేధం విధించారు. నాలుగు రోజుల పాటు విక్రయాలు జరగకుండా కఠిన చర్యలు అమలులో ఉన్నాయని చెప్పారు. ఆ మేరకు పంచాయితీ ఈఓకు ఆదేశించారు. వ్యాఽధి పూర్తిగా అదుపులోకి వచ్చేంత వరకు వైద్య శిబిరాలు కొనసాగించాలని సూచించారు. ఆమెతో పాటు డీఎల్‌పీవో ఐవీ రమణ, ఎంపీడీఓ మన్మధరావు, ఏఓ మిశ్రా, సర్పంచ్ ఆర్, లక్ష్మి తదితరులు ఉన్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు
Comments
Please login to add a commentAdd a comment