కూల్చేస్తారా?
కనిపిస్తున్న
కట్టడాలన్నీ
అరసవల్లి: రథసప్తమి సమీపిస్తున్న వేళ అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ పరిసరాలన్నీ కూల్చివేతలతో నిర్మానుష్యంగా మారుతోంది. అభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే దుకాణాల సముదాయాలు, అన్నదాన, ప్రసాదాల మండపాలను, వసతి గదుల సముదాయాలను కూల్చివేయగా.. ఆలయం ఎదురుగా ఉన్న పలు జిరాయితీ హక్కుదారుల ఇళ్లను సైతం కూల్చివేసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆలయానికి ఎదురుగా ఉన్న భారీ ప్రహరీని కూల్చివేసిన తర్వాత.. ఆనుకుని ఉన్న ఇంటిని సైతం కూల్చివేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో ఒక్కసారిగా ఇంటి యజమానులు, ఇరుగుపొరుగు వారు బుధవారం ఉదయం నుంచి ప్రతిఘటించారు. ఇదేంటని ఆలయ ఈవో వై.భద్రాజీని నిలదీశారు. రాష్ట్ర పండుగగా ఉత్సవాలు చేసుకోవాలని.. ఘనంగా రథసప్తమిని జరుపుకోవాలని...అలా అని కనిపిస్తున్న కట్టడాలన్నీ కూల్చివేస్తామంటే ఎలా అని నిలదీశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గొండు శంకర్ అరసవల్లి చేరుకుని ఇంటి యజమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయానికి ఎదురుగా ఉన్న సుంకరి రమణమ్మ కుటుంబసభ్యులంతా తమకు ఆ ఇంటితో ఉన్న సంబంధాన్ని వివరిస్తూ.. ప్రాణాలను సైతం వదులుకుంటాం గానీ ఇంటిని వదులబోమని బదులిచ్చారు. దీంతో ఎమ్మెల్యే కాస్త వెనక్కి తగ్గి... ఇంటికి బదులు ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలాన్ని ఇవ్వాలని కోరారు. కాసేపు చర్చల అనంతరం రమణమ్మ కుమార్తెలు ఖాళీ స్థలాన్ని ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. దీనికి బదులుగా ఆలయానికి చెందిన స్థలాన్ని ప్రత్యామ్నాయంగా అందజేస్తామని ఎమ్మెల్యే సమక్షంలో ఆలయ ఈవో వై.భద్రాజీ ప్రకటించారు. దీంతో సమస్య సద్దుమణిగింది. అనంతరం మున్సిపల్ టౌన్ సర్వే, దేవదాయ శాఖ సర్వే అధికారుల బృందం సేకరించాల్సిన స్థలాల విస్తీర్ణాన్ని లెక్కించారు. మొత్తంగా 5.75 సెంట్ల స్థలాన్ని (పావు తక్కువ ఆరు సెంట్లు) మార్క్ చేసి మ్యాపింగ్ చేశారు. గురువారం నుంచి రహదారి నిర్మాణాన్ని చేపట్టేందుకు మున్సిపల్, ఆలయ అధికారులు సిద్ధం చేశారు.
ఇల్లు కూల్చితే ఒప్పుకునేది లేదు
ఎమ్మెల్యే శంకర్‌తో వాదనకు దిగిన
ఇంటి యజమానులు
ప్రత్యామ్నాయ స్థలాలను చూపించాం..
ఆలయానికి ముందున్న ఇంటిని కాకుండా వెనుకున్న సుమారు ఆరు సెంట్ల స్థలాన్ని ఆలయ అభివృద్ధి పనులకు వినియోగించనున్నాం. ఇందుకు ప్రత్యామ్నయంగా 80 ఫీట్ రోడ్డు, వప్పంగి రోడ్డులో పలు స్థలాలను ఇంటి యజమానులకు చూపించాం. వారి ఇష్టం మేరకు సరిపడిన స్థలాన్ని ఇస్తాం. ఇప్పటికే ఆర్డీవోతో చర్చించాం.
– వై.భద్రాజీ, ఆలయ ఈవో
ఇంటిని కూల్చనివ్వం..
ఆరు దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నాం. నా ముగ్గురు పిల్లలకు వెనుక ఖాళీ జాగాను పంచి ఇచ్చాను. రోడ్డు వేస్తామని ఇంటిని కూల్చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. అడ్డుకునేసరికి ఇంటి వెనుక స్థలాన్ని మాత్రమే తీసుకుంటామని చెప్పారు. ఇంటిని మాత్రం ఇచ్చేది లేదని మా పిల్లలు కూడా తేల్చిచెప్పేశారు. 80 ఫీట్ రోడ్డులో స్థలాన్ని ఇస్తామని ఎమ్మెల్యే చెప్పారు. దీంతో ఇంటి వెనుక స్థలాన్నిచ్చేందుకు మా వాళ్లంతా ఒప్పుకున్నారు.
– సుంకరి రమణమ్మ,
ఇంటి యజమాని
Comments
Please login to add a commentAdd a comment