కొనుగోళ్లు ముమ్మరం
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలను త్వరగానే ప్రారంభించినా.. కాంటాలు అనుకున్న సమయానికి వేయలేదు. ఈ నెల మొదటి వారం నుంచి మిల్లుల కేటాయింపులు జరగ్గా.. చురుగ్గానే కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డురకం, 1,71,197 మెట్రిక్ టన్నులు సన్నరకం ధాన్యం సేకరించాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఇప్పటి వరకు 44,476 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యాన్ని జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు సేకరించారు. ఈ ధాన్యం విలువ సుమారుగా రూ.103.19 కోట్ల మేర ఉంటుంది.
బోరుబావుల కిందనే..
జిల్లాలో వానాకాలం సీజన్లో సుమారు 4.72 లక్షల ఎకరాల్లో వరిని రైతులు సాగు చేశారు. ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీరు అందకపోగా.. సాగర్, మూసీలతో పాటు బోరుబావుల కింద వరి సాగైంది. ప్రస్తుతం జిల్లాలో బోరుబావుల కింద సాగైన వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సంవత్సరం సన్నరకం ధాన్యం అధికంగా సాగైనట్లు అధికారులు అంచనా వేసినా.. దొడ్డురకం వరి పంట సైతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు బాగానే వచ్చింది. సాగర్ ఆయకట్టు పరిధిలో ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాంతంలో ఎక్కువగా సన్నాలే సాగు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో బోరుబావుల కింద సాగైన వరి పంట మాత్రమే ఎక్కువగా ఉంది. ఇందులోనూ తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఎక్కువ ధాన్యం (దొడ్డురకం) వచ్చింది.
జిల్లాలో వరి సాగు : 4.72 లక్షల ఎకరాలు
దిగుబడి అంచనా : 10.22 లక్షల మెట్రిక్ టన్నులు
కొనుగోలు కేంద్రాలు : 206 సెంటర్లు
కేంద్రాలకు వచ్చే ధాన్యం అంచనా :
దొడ్డురకం: 2 లక్షల మెట్రిక్ టన్నులు
సన్నరకం : 1,71,197 మెట్రిక్ టన్నులు
కొనుగోలు చేసిన ధాన్యం :
దొడ్డురకం: 44,476 మెట్రిక్ టన్నులు
ధాన్యం విలువ : రూ.103.19 కోట్లు
ఫ వానాకాలం ధాన్యం సేకరణ లక్ష్యం 3.70 లక్షల మెట్రిక్ టన్నులు
ఫ జిల్లాలో 206 సెంటర్ల ఏర్పాటు
ఫ సుమారు 44,476 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
టార్గెట్ చేరేనా..
జిల్లాలో దాదాపు 10.22 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. రైతుల అవసరాలు, ప్రైవేటు అమ్మకాలు, బహిరంగ మార్కెట్‌కు పోగా ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు సుమారు 3.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని అధికారులు భావించారు. ధాన్యం సేకరణ కోసం 206 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ యేడాది మిల్లుల కేటాయింపు ప్రక్రియ కొంత ఆలస్యమైంది. ఈ నెల మొదటి వారం నుంచి మిల్లుల కేటాయింపులు జరగ్గా.. కొనుగోళ్లు ముమ్మరమయ్యాయి. ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం సన్నాలకు బోనస్ రూ.500 చెల్లించనుండడంతో ఈ రకం ధాన్యం బాగానే కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. కానీ చాలామంది రైతులు మిల్లులు, బహిరంగ మార్కెట్లో అమ్మకానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్నరకం ధాన్యం తక్కువగానే ఉంది. ఈ క్రమంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యంలో ఇప్పటికే 44,476 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా.. మరో 1.60 వేల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment