ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
కోదాడ: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కోరారు. బుధవారం కోదాడ మండలం తమ్మర వద్ద కోదాడ పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులు నిబంధనల ప్రకారం ధాన్యాన్ని ఆరబెట్టి తీసుకువచ్చి ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధరతోపాటు, సన్న ధాన్యానికి బోనస్ పొందాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, ఈ విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దన్నారు. కొనుగోలు చేసిన తరువాత రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులు కమిటీగా ఏర్పడి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చూడాలని, సమస్యలుంటే కమిటీ అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. రైతులు ముందస్తుగా కోసి పచ్చిధాన్యం తేస్తున్నారని, అలా కాకుండా కోతకు వచ్చిన తరువాత పంట కోయాలని ఆయన సూచించారు. అనంతరం చిమిర్యాల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు కోదాడ ప్రభుత్వ వైద్యశాలను, అల్వాలపురం వద్ద ఏర్పాటు చేసిన ఓ వెంచర్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఆయన వెంట కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ వాజిద్, ఏడీఏ యల్లయ్య, ఏఓ రజని, సొసైటీ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, సీఈఓలు వెంకటేశ్వర్లు, జొన్నలగడ్డ కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment