‘శాండ్ ట్యాక్సీ’కి విశేష స్పందన
సద్వినియోగం చేసుకోవాలి
ఇసుక ట్యాక్సీ పథకంతో ఇళ్లు, ఇతర నిర్మాణాలు చేపట్టే వారికి అదనపు భారం తగ్గింది. తక్కువ ధరకు ఇసుక సరఫరా చేస్తున్నాం. నాలుగు మండలాల ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నెల రోజుల వ్యవధిలో ఈ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
– జక్కర్తి శ్రీనివాసులు,
తహసీల్దార్, జాజిరెడ్డిగూడెం
ఫ నెల రోజుల్లో 1,800 ట్రాక్టర్లకు
పైగానే బుకింగ్
ఫ ఇప్పటికే 1,400 ట్రాక్టర్ల వరకు
సరఫరా
ఫ తక్కువ ధరకే ఇంటికొస్తున్న ఇసుక
ఫ ఆనందంలో
నాలుగు మండలాల ప్రజలు
అర్వపల్లి: మన ఇసుక –మన వాహనం పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక ట్యాక్సీ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నెల రోజుల నుంచి అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ఇసుకను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకుంటుండగా రెవెన్యూ, ఇతర అధికారులు నేరుగా వినియోగదారుల ఇళ్లకే సరఫరా చేయిస్తున్నారు. దీంతో గతంలో కొన్ని నెలలుగా నిలిచిపోయిన ఇళ్లు, ఇతర నిర్మాణాల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కాగా గతంలో ఇసుకను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు కొని వినియోదారులు తీవ్రంగా నష్టపోయారు. ఇసుక ట్యాక్సీ పథకంతో తక్కువ ధరకు సరఫరా అవుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నెల రోజుల నుంచి..
ఈ విధానం మొదలైన నెల రోజుల్లోనే ఇప్పటి వరకు 1,800 ట్రాక్టర్ల ఇసుకకు పైగానే ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోగా 1,400 ట్రాక్టర్ల వరకు సరఫరా చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డిగూడెం, నాగారం, తుంగతుర్తి మండలాలతో పాటు సూర్యాపేట నియోజకవర్గంలోని సూర్యాపేట మండల ప్రజలకు ఇక్కడి నుంచి ఇసుక సరఫరా జరుగుతోంది. అయితే గతంలో మూసీనది నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్వపల్లికి ఇసుక సరఫరాకు ఒక్కో ట్రాక్టర్‌కు సుమారు రూ.5వేల వరకు వినియోదారునికి ఖర్చు అయ్యేది. ఈ కొత్త విధానంతో కేవలం రూ.2,319కే ట్రాక్టర్ ఇసుక లభిస్తోంది. ఈ లెక్కన ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు వినియోగదారునికి సుమారు రూ.2,700 వరకు అదనపు భారం తగ్గింది. అయితే ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిందని, ఈ పథకాన్ని ఇలాగే కొనసాగించాలని అధికారులకు నాలుగు మండలాల ప్రజలు, వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
భారం చాలా తగ్గింది
ఇంతకు ముందు నా ఇంటి నిర్మాణం కోసం ఒక్కో ట్రాక్టర్‌కు రూ.4 నుంచి రూ.5 వేల వరకు వెచ్చించి ఇసుకను తెచ్చుకున్నాను. ఇసుక ట్యాక్సీ పథకంతో రూ.2,319కే ట్రాక్టర్ ఇసుక సరఫరా చేస్తున్నారు. దీంతో ఆర్థిక భారం చాలా తగ్గింది.
– జిల్లా కిరణ్, అర్వపల్లి
Comments
Please login to add a commentAdd a comment