భూగర్భ జలాల్లో మోతాదుకు మించి రసాయన అవశేషాలు
భూగర్భ జలాల నాణ్యత నివేదిక–2024లో వెల్లడి
ఉమ్మడి జిల్లాలో ప్రమాదకరంగా భూగర్భ జలాలు
నీటిలో మూలకాలు మోతాదుకు మించితే తీవ్ర అనారోగ్య సమస్యలు
నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో అధికంగా ఫ్లోరైడ్, క్లోరైడ్
సూర్యాపేట జిల్లాలో ఆర్సెనిక్ పరిమాణం అధికం
భూగర్భ జలాల్లో పలు రసాయన అవశేషాలు మోతాదుకు మించి ఉన్నాయని, ఆ నీటిని తాగితే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని భూగర్భ జలాల నాణ్యత నివేదిక–2024 వెల్లడించింది. ఉమ్మడి జిల్లాలోని రెండు చోట్ల ఆర్సెనిక్ అనే రసాయన అవశేషాలు, ఫ్లోరైడ్, నైట్రేట్ మోతాదుకు మించి ఉన్నట్లుగా పేర్కొంది.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల భూగర్భ జలాలు ప్రమాదకరంగా ఉన్నాయని, ఆ నీటిని తాగితే వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని భూగర్భ జలాల నాణ్యత నివేదికలో వెల్లడైంది. 2023లో నైరుతి రుతుపవనాలు రావడానికి ముందు, అవి వచ్చిన తరువాత వర్షాలు కురిశాక దేశవ్యాప్తంగా రెండుసార్లు భూగర్భ జలాలను కేంద్ర భూగర్భ జల మండలి సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షించింది. ఆ పరీక్షల్లో వెల్లడైన అంశాలతో వార్షిక భూగర్భ జలాల నాణ్యత నివేదిక–2024ను విడుదల చేసింది. ఆ నీటిలోని రసాయన అవశేషాలు, వాటి వల్ల ఎదురయ్యే సమస్యలను వివరించింది. ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పరిస్థితులను కూడా అందులో వెల్లడించింది. జిల్లాలోని పలు చోట్ల ఫ్లోరైడ్, క్లోరైడ్, నైట్రేట్‌తోపాటు రెండు చోట్ల ఆర్సెనిక్ అనే రసాయన పదార్థం అవశేషాలు ఉన్నట్లు వెల్లడించింది.
సాధారణంగా నీటిలో క్లోరైడ్ ప్రతి లీటరు నీటిలో 250 ఎంజీ నుంచి 1000 ఎంజీలోపే ఉండాలి. కానీ యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం నాగారంలో ప్రతి లీటర్ నీటిలో 1158 ఎంజీ క్లోరైడ్ ఉండగా, రామన్నపేటలో 1050 ఎంజీ క్లోరైడ్ ఉన్నట్లు తేల్చింది.
అధిక ఐరన్‌తోనూ ముప్పే..
తాగునీటిలో ఐరన్ సాధారణం కంటే ఎక్కువగా ఉంటే కూడా అనారోగ్యం బారిన పడతారని పేర్కొంది. ఆ నాటిని తాగితే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి తదితర అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని పేర్కొంది. సాధారణంగా లీటరు నీటిలో 1.0 ఎంజీ మాత్రమే ఐరన్ ఉండాలి. అయితే జిల్లాలోని సూర్యాపేటలో 1.32 ఎంజీ, బోడంగిపర్తిలో 1.19 ఎంజీ, చిన్నపడిశాలలో 1.17 ఎంజీ ఐరన్ మూలకాలు ఉన్నట్లుగా తేలింది.
ఫ్లోరైడ్ ప్రతి లీటర్ నీటిలో (మిల్లీ గ్రాముల్లో)
నల్లగొండ జిల్లాలో..
అంతంపేట–2 5.04
అంతంపేట–1 4.28
ఎల్లారెడ్డిగూడెం 3.58
చీకటిగూడెం 3.23
అజిలాపురం 2.68
కురుమపల్లి 2.9
చెన్నంనేనిపల్లి 2.01
వద్దిపట్ల 2.02
పలివెల, అడవితూమలపల్లి, చింతపల్లి, నారమ్మగూడెం, మాసంగి, చీకటిమామిడి గ్రామాల్లో ప్రతి లీటరు నీటిలో 1.5 ఎంజీ నుంచి 2 ఎంజీ వరకు ఫ్లోరైడ్ ఉన్నట్లు తేలింది.
నాగారం 2.2
హసనబాద్ 2.89
మల్కాపురం 3.08
మార్టూర్ 3.1
మల్లాపురం 3.01
మల్కాపూర్ 3.13
మునిపంపుల 2.18
మర్యాల 2.26
జానకిపురం, ఎన్నారం, చందేపల్లి, స్వామివారిలింగోటం, కొరటికల్, వెంకటాపురం, గుజ్జ, రామన్నపేట, వీరవల్లి, ఎం. తుర్కపల్లి గ్రామాల్లో ప్రతి లీటరు నీటిలో 1.5 ఎంజీ నుంచి 2 ఎంజీ వరకు ఫ్లోరైడ్ ఉన్నట్లు తేలింది.
సూర్యాపేట జిల్లాలో.. ఎర్రవరంలో ప్రతి లీటరు నీటిలో 2.09 ఎంజీ ఫ్లోరైడ్ ఉండగా, 1.5 నుంచి 2 ఎంజీ వరకు గుడిబండ, కందగట్ల, బాలెంల, యెర్కారం, కుడ్లి, మోతె, అర్వపల్లిలో ఉంది.
భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించాలి
పంటల్లో ఎక్కువగా రసాయన ఎరువులు వాడొద్దు. వాటిని వాడితే నైట్రేట్ ఎక్కువగా వస్తుంది. భూగర్భంలో ఎక్కువ లోతుకు వెళ్లి నీటిని తీసుకోవద్దు. తద్వారా వాటి ప్రభావాన్ని పరిమితం చేయవచ్చు. రిజర్వాయర్లలో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేస్తే కొంత ఉపయోగం ఉంటుంది. భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించాలి.
– డాక్టర్ జి.మచ్చేందర్, ఎంజీయూ, జియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్
Comments
Please login to add a commentAdd a comment