అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
గరిడేపల్లి: మండల పరిధిలోని ఎల్బీనగర్ గ్రామంలో ఆదివారం రాత్రి ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన నందిపాటి శోభ(32)కు 2011లో సూర్యాపేటకు చెందిన రాజు అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. కొంతకాలంగా భర్తకు దూరంగా గరిడేపల్లి మండలం ఎల్బీనగర్‌లో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్న శోభ కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆదివారం రాత్రి శోభ తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉండటాన్ని చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని సోమవారం శోభ తండ్రి వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు.
చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు దుర్మరణం
నల్లగొండ: బైక్‌పై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ పట్టణంలోని వీటీ కాలనీలో సోమవారం జరిగింది. నల్లగొండ టూటౌన్ ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని బీటీఎస్ ప్రాంతానికి చెందిన గంటి ప్రవీణ్(23) రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై వీటీ కాలనీలో ఉంటున్న తన మేనమామ ఇంటికి వచ్చి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో న్యూ వీటీ కాలనీ వద్ద బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రదీణ్ బైక్ పైనుంచి ఎగిరి రోడ్డుపై పడిపోవడంతో అతడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు.
అదుపుతప్పి కారు బోల్తా
మిర్యాలగూడ అర్బన్: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై మిర్యాలగూడ పట్ట ణంలో సోమవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి గుంటూరుకు ఇద్దరు వ్యక్తులు కారులో వెళ్తుండగా.. మార్గమధ్యలో మిర్యాలగూడ పట్టణంలోని ఫ్‌లైఓవర్ సమీపంలో అద్దంకి–నార్కట్‌పల్లి రహదారిపై కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న దిమ్మెలను ఢీకొని బోల్తాపడింది. స్థానికులు గమనించి కారులోని ఇద్దరు వ్యక్తులను అతికష్టం మీద బయటకు తీశారు. వారికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment