దారి.. మూసేసిరి! | - | Sakshi
Sakshi News home page

దారి.. మూసేసిరి!

Published Sun, Jan 19 2025 1:24 AM | Last Updated on Sun, Jan 19 2025 1:24 AM

దారి.

దారి.. మూసేసిరి!

కోదాడ పట్టణంలోని భవానీనగర్‌లో మున్సిపాలిటీ రోడ్డు మూసివేత

కోదాడ: కోదాడ పట్టణ పరిధిలోని భవానీనగర్‌లో మున్సిపాలిటీ రోడ్డును పట్టాపేరుతో కొందరు ఆక్రమించుకున్నారు. రోడ్డుకు అడ్డంగా డబ్బాకొట్లు ఏర్పాటు చేసి దారిని మూసివేశారు. దీంతో పదేళ్లుగా ఈ రోడ్డుపై రాకపోకలు సాగిస్తున్న కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే..

కోదాడ పట్టణ పరిధిలోని భవానీనగర్‌ నుంచి గుడిబండ వెళ్లడానికి వీలుగా భవానీనగర్‌ ఏర్పాటు సమయంలో లేఅవుట్‌లో మున్సిపాలిటీ రోడ్డును నిర్మించారు. గతంలో ఇక్కడ నివాసాలు తక్కువగా ఉండడంతో ఆ రోడ్డును పెద్దగా వినియోగించేవారు కాదు. కాల క్రమేణా భవానీనగర్‌ విస్తరించడంతో ఈ రోడ్డును వినియోగించసాగారు. పది సంవత్సరాల క్రితం ఈ రోడ్డు పక్కన ఉన్న ప్లాట్‌ యజమాని తనకు రోడ్డు వెంట స్థలం రిజిస్ట్రేషన్‌ ఉందని చెబుతూ ఈ రోడ్డును పూర్తిగా మూసివేసి తన ప్లాట్‌లో కలిపేసుకోవడానికి ప్రయత్నించగా కాలనీ వాసులు అడ్డుకున్నారు. దీనిపై పెద్ద గొడవ చేశారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు అప్పట్లో ఆక్రమణలు తొలగించి అక్కడ రోడ్డును ఏర్పాటు చేశారు. అంతే కాకుండాడా భవానీనగర్‌నుంచి వచ్చే డ్రెయినేజీని కూడా రోడ్డు పక్కన నిర్మించారు. కాలనీ వాసులు ఈ రోడ్డు నుంచి నేరుగా ఖమ్మం క్రాస్‌రోడ్డుకు, గుడిబండ రోడ్డుకు రాకపోకలు సాగించసాగారు.

మూడు డబ్బాకొట్లు ఏర్పాటు చేసి..

మున్సిపాలిటీ రోడ్డుకు అడ్డంగా గుడిబండ రోడ్డువైపు ఆరు నెలల క్రితం చిన్న డబ్బాకొట్టు ఏర్పాటు చేశారు. తరువాత విడతల వారీగా మూడు డబ్బాకొట్లను ఏర్పాటు చేసి రోడ్డును పూర్తిగా మూసి వేశారు. కాలనీ వాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. కాలనీ వాసులు దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మున్సిపాలిటీ రోడ్డుకు అడ్డంగా డబ్బాకొట్లను ఏర్పాటు చేసినా మున్సిపాలిటీ అధికారులు ఇదేమిటని అడగడం లేదని కాలనీ వాసులు అంటున్నారు.

నాడు రోడ్డన్నారు.. నేడు పట్టా అంటున్నారు..

భవానీనగర్‌ లే–అవుట్‌ చేసిన సమయంలో అన్నిరోడ్లను గుడిబండ రోడ్డుకు కలిపారు. ప్రస్తుతం మూసి వేసిన రోడ్డుకు పక్కన ఉన్న రోడ్డును కూడా గుడిబండరోడ్డుకు కలిపారు. ఈ ఒక్క రోడ్డు వద్ద క్రాస్‌ రావడంతో వాస్తుకోసం కొంతమేర ఖాళీ స్థలాన్ని వదిలారు. ఈ కొద్ది స్థలాన్ని మరో సర్వే నంబర్‌గా చూపుతూ కొందరు రిజిస్ట్రేషన్‌ చేయగా దాన్ని చూపుతూ రోడ్డును మూసి వేశారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ కొద్ది స్థలానికి సంబంధించి లింక్‌ డాక్యుమెంట్లు చూస్తే అసలు విషయం బయడపడుతుందని వారు సూచిస్తున్నారు. ఆ రోడ్డు ప్రాంతంలో మాత్రమే 100 గజాల స్థలానికి వేరే సర్వే నంబర్‌ రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ రోడ్డు మూసి వేస్తే భవానీనగర్‌ నుంచి వచ్చే డ్రెయిన్‌ కూడా మూసుకొనిపోతుందని, సెప్టెంబర్‌లో కురిసిన వర్షానికి ఈ ప్రాంతం మునిగిపోయిందని కాలనీవాసులు చెబుతున్నారు. ఇక్కడ స్థలం విలువ ఎక్కువగా ఉండడం వల్ల అలా చేస్తున్నారని వారు అంటున్నారు. ఖాళీ స్థలానికి తప్పుడు పత్రాలు సృష్టించి రోడ్డును ఆక్రమిస్తున్నారని, దీనిపై పూర్తిస్థాయిలో సర్వేచేసి రోడ్డును తెరిపించాలని కాలనీ వాసులు .. అధికారులను కోరుతున్నారు.

దశలవారీగా డబ్బాకొట్లు

ఏర్పాటు చేసి ఆక్రమణ

రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు

అధికారులకు కాలనీవాసుల ఫిర్యాదు

రోడ్లను ఆక్రమిస్తే కేసులు

నమోదు చేస్తాం

కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రోడ్డును కొందరు మూసివేసిన విషయం మా దృష్టికి రాలేదు. తక్షణమే మున్సిపాలిటీ సిబ్బందిని పంపించి తగు చర్యలు తీసుకుంటాం. మున్సిపాలిటీ రోడ్లను ఆక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం.

– రమాదేవి, కోదాడ మున్సిపల్‌ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
దారి.. మూసేసిరి!1
1/1

దారి.. మూసేసిరి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement