కంది రైతులకు మద్దతు
తిరుమలగిరి, సూర్యాపేటలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
తిరుమలగిరి (తుంగతుర్తి) : కందులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఇటీవల రెండు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో మద్దతు ధర క్వింటాకు రూ.7,550 దక్కనుంది. జిల్లాలో వానా కాలంలో సాగు చేసిన కంది పంట గత డిసెంబర్ నుంచి చేతికి వస్తోంది. ఈ నెల మొదటి వారం నుంచి కంది కోతలు అధికంగా కొనసాగుతున్నాయి. రైతులు కందులను అమ్మడానికి వ్యవసాయ మార్కెట్లకు వస్తున్నారు. ప్రారంభంలో కందులు క్వింటాకు రూ.8 వేలకు పైగానే ధర లభించింది. సూర్యాపేట, తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లలో మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో రెండు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఈ రెండు కేంద్రాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో అధికారులు కొనుగోళ్లు జరుపుతారు. కొనుగోలు చేసిన కందులను మార్క్‌ఫెడ్ ద్వారా రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తారు. అయితే జిల్లాలో ఇప్పటి వరకు ఈ రెండు కేంద్రాల్లో కందుల కొనుగోళ్లు జరగలేదు.
ఆన్‌లైన్‌లో పేర్లు నమోదైన వారు మాత్రమే..
కనీస మద్దతు ధరకు కందులను విక్రయించే రైతులు పంట సాగుకు సంబంధించి ఈ సమృద్ధి పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారై ఉండాలి. జిల్లాలో 2,540 ఎకరాల్లో కంది సాగు చేశారు. ఈ కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.7,550 పొందవచ్చు. అయితే బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం క్వింటాకు రూ.6,700 నుంచి రూ.7,000 వరకు ధర వస్తుండటంతో రైతులు ఎక్కువగా ప్రైవేట్ వ్యాపారులకే విక్రయిస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలంటే తేమ శాతం 12లోపు ఉండాలి. నాణ్యతా ప్రమాణాలతో లోబడి ఉంటేనే మద్దతు ధర వస్తుంది.
క్వింటాకు మద్దతు ధర రూ.7,550
ఈ సమృద్ధి పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారే విక్రయించడానికి అర్హులు
2,540 ఎకరాల్లో కంది సాగు
నాణ్యతా ప్రమాణాలతో తీసుకురావాలి
కొనుగోలు కేంద్రాల్లో కందులను విక్రయించాలంటే ఈ సమృద్ధి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలి. ఎకరాకు 3 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయని అంచనా వేశాం. ఆ లెక్కన భూమి విస్తీర్ణాన్ని బట్టి దిగుబడులను కొనుగోలు చేస్తారు. 12 శాతం తేమ ఉండేలా చూడాలి.
– జ్యోతి, జిల్లా మేనేజర్, మార్క్‌ఫెడ్
నాణ్యతా ప్రమాణాలు
తేమ శాతం 12
ఇతర పదార్థాలు 2 శాతం
దెబ్బ తగిలిన గింజలు 3 శాతం
రంగు పోయి దెబ్బతిన్న గింజలు 4 శాతం
పక్వంకాని గింజలు 3 శాతం
పురుగులు పట్టిన గింజలు 1 శాతం
ఇతర పంట గింజలు 3 శాతం
Comments
Please login to add a commentAdd a comment