మేళ్లచెరువు జాతరకు రూ.కోటి మంజూరు
మేళ్లచెరువు : మేళ్లచెరువు మండలకేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవాల సందర్భంగా నిర్వహించే మహాశివరాత్రి జాతరకు ప్రభుత్వం నుంచి రూ.కోటి మంజూరైనట్లు ఈఓ కొండారెడ్డి గురువారం తెలిపారు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని దేవాలయ అభివృద్ధికి నిధులు కేటాయించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఇరిగేషన్ అధికారులపై మంత్రి ఉత్తమ్ గరం గరం!
హుజూర్‌నగర్ : హుజూర్‌నగర్ నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు సరిగా చేపట్టకపోవడంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమారెడ్డి ఇంజనీరింగ్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గురువారం హైదరాబాద్ నుంచి మంత్రి అధికారులతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఎక్కడ సమస్య వస్తుందో తెలుసుకొని వెంటనే పనులు మొదలు పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. పనులు మొదలు కాకపోవడం గురించి ఒకరిపై ఒకరు తోసిపుచ్చుకున్న జిల్లా అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సొంత నియోజకవర్గంలోనే పనులు కాకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. జిల్లా ఎస్‌ఈతో పాటు జిల్లాలోని ఇరిగేషన్ అధికారులను వెంటనే హైదరాబాద్ ఆఫీస్‌కు రావాలని ఈఎన్‌సీకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతల స్వీకరణ
సూర్యాపేట: మున్సిపల్ ప్రత్యేక అధికారిగా అదనపు కలెక్టర్ రాంబాబు గురువారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయనను మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెద్దగట్టు జారత పనులు, ఇంటి పన్నుల వసూలు, మున్సిపాలిటీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఈఈ కిరణ్, డీఈ సత్యరావు, ఆర్వో కళ్యాణి, ఎస్‌ఐ సారగండ్ల శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్లు గౌసుద్దీన్, యాదగిరి, ఎస్‌ఎస్‌ఆర్ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గాంధీకి నివాళి
సూర్యాపేటటౌన్ : మహాత్మా గాంధీజీ వర్ధంతిని సూర్యాపేట జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. ఈ సదర్భంగా జాతిపిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అర్ముడ్ అదనపు ఎస్పీ జనార్ధన్ రెడ్డి, ఆర్‌ఐలు నారాయణ రాజు, నరసింహ పాల్గొన్నారు.
మోతె తహసీల్దార్ సస్పెన్షన్
భానుపురి,మోతె : కుటుంబ సభ్యులందరి అనుమతి లేకుండా అక్రమంగా పౌతి చేసిన మోతె తహసీల్దార్ సంఘమిత్రను సస్పెండ్ చేయడంతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నాగరాజును విధుల నుంచి తొలగిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అక్రమ పట్టా మార్పిడిపై సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవరావుతో విచారణ జరిపించినట్లు తెలిపారు. చివ్వెంల మండలం తిరుమలగిరికి చెందిన మట్టపల్లి వెంకటాచలం కరోనా సమయంలో మరణించారని, అతనికి మోతెలో 7.10 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. అతనికి ఇద్దరు భార్యలు ఉండగా మొదటి భార్య మరణించిందని, ఆమెకు రమణ, సైదమ్మ ఇద్దరు కుమార్తెలు ఉన్నారని తెలిపారు. రెండో భార్య పూలమ్మకు కుమారుడు రఘు ఉండగా, రెండవ భార్య కుమారుని పేరిట కుటుంబ సభ్యుల సర్టిఫికెట్ ఉన్నా, ఆ భూమి యూనియన్ బ్యాంక్‌లో మార్టిగేజ్ చేసి ఉన్నా అక్రమంగా మొదటి భార్య కుమార్తెలు సైదమ్మ, రమణ పేరిట మాత్రమే పౌతీ ద్వారా అక్రమంగా పట్టా మార్పిడి చేశారని తెలిపారు. దీనికి బాధ్యులైన మోతె తహసీల్దార్ సంఘమిత్రను సస్పెండ్ చేస్తున్నామని, కంప్యూటర్ ఆపరేటర్ నాగరాజును విధుల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment