![Sai Pallavi-Sivakarthikeyan film gets - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/27/5252.jpg.webp?itok=AxMjAaMI)
తమిళ సినిమా: ప్రిన్స్ చిత్రం దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నటుడు శివకార్తికేయన్ కొత్త చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మావీరన్ చిత్రంలో నటిస్తున్నారు. మడోనా అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగులోనూ మహావీరుడు పేరుతో విడుదలకానుంది. దర్శకుడు శంకర్ వారసురాలు అతిథి శంకర్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో శివకార్తికేయన్ తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీన్ని కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించనున్నారు.
ఇది శివకార్తికేయన్ 21వ చిత్రం కావడం గమనార్హం. ఇందులో సాయి పల్లవి నాయకిగా నటించనుంది. రాజకుమార్ పెరియసామి కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కాగా తొలి షెడ్యూల్‌ను కశ్మీర్‌లో చిత్రీకరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే అక్కడ ఇటీవల స్వల్ప భూకంపం వచ్చి కశ్మీర్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న లియో చిత్రం షూటింగ్ జరుపుకున్న విషయం తెలిసిందే.
అయితే భూకంపం కారణంగానే లియో చిత్ర యూనిట్ హడావుడిగా షూటింగ్‌ను ముగించుకుని చైన్నెకు తిరిగొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శివకార్తికేయన్ నటించనున్న చిత్రాన్ని అక్కడ షూటింగ్ నిర్వహించడానికి ముందు అక్కడ వాతావరణం గురించి లియో చిత్రం దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌ను అడిగి తెలుసుకుని ఆ తరువాత కాశ్మీర్‌లో షూటింగ్ నిర్వహించాలా? లేదా? అన్నది నిర్ణయించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment