కిడ్నాప్‌ కేసులో ఐదుగురి అరెస్టు | Sakshi
Sakshi News home page

కిడ్నాప్‌ కేసులో ఐదుగురి అరెస్టు

Published Mon, May 6 2024 8:50 AM

కిడ్నాప్‌ కేసులో ఐదుగురి అరెస్టు

కొరుక్కుపేట: రూ. 34 లక్షలు రుణం చెల్లించకపోవడంతో యువకుడిని కారులో కిడ్నాప్‌ చేసిన మాతేష్‌సహ ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణగిరి జిల్లా పార్కూర్‌ నక్కల్‌ పట్టి గ్రామానికి చెందిన బాలాజీ(32) కుటుంబంలో విభేదాల కారణంగా భార్యకు విడాకులు ఇచ్చి, ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ స్థితిలో కృష్ణగిరి జిల్లా కరాడికొళ్లపట్టి ప్రాంతానికి చెందిన తన మామ బంధువు మాతేష్‌ వద్ద బాలాజీ రూ. 34 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. నిర్ణీత వ్యవధిలోగా రుణం చెల్లించలేదు. ఆ తర్వాత డబ్బుకు బదులుగా బాలాజీ పేరిట ఉన్న 2 ఎకరాల 22 సెంట్ల భూమిని తన తండ్రి పేరు మీద రాసివ్వాలని మాతేష్‌ పట్టుబట్టాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ స్థితిలో బాలాజీ ఈ నెల ఒకటో తేదీన అద్దె కారులో చైన్నె వెళ్లాడు. ఆ తర్వాత మాతేష్‌ కొందరు స్నేహితులతో కలిసి కారులో అతడిని అనుసరించాడు. బాలాజీ, డ్రైవర్‌ రిదీష్‌ను కారుతో అపహరించి ధర్మపురి జిల్లా కారిమంగళంలోని కుంబరహళ్లి చెక్‌పోస్టు సమీపంలోని ఓ ప్రైవేట్‌ లాడ్జిలో బంధించారు. మరుసటి రోజు ఉదయం బాలాజీని కృష్ణగిరి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి తీసుకువెళ్లారు. భూమిని మాతేష్‌ తన తండ్రి మురుగేషన్‌ పేరు మీద రిజిస్టర్‌ చేయాలని కోరారు. అందుకు అతడు అంగీకరించకపోవటంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని, ఇవ్వకుంటే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే బాలాజీ కరీముంగ్కాలం పోలీసు స్టేషన్‌కు వెళ్లి సంఘటనపై ఫిర్యాదు చేశారు. లాడ్జి వద్ద ఉన్న మాతేష్‌తోపాటు శాంతకుమార్‌ (44), సెల్వ కమల్‌ (46), రాజ్‌సుమల్‌ (36), కార్తీక్‌ (31)ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, లగ్జరీ కారును, కిడ్నాప్‌కు ఉపయోగించిన కత్తి సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న గోవిందన్‌ పరారీలో ఉండడంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement