శభాష్‌! | - | Sakshi
Sakshi News home page

శభాష్‌!

Published Thu, Oct 17 2024 2:20 AM | Last Updated on Thu, Oct 17 2024 2:17 PM

పారిశుధ్య కార్మికులకు సహాయకాలు అందజేస్తున్న డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌

రెస్క్యూ బృందాలపై సీఎం స్టాలిన్‌ ప్రశంసల జల్లు 

ముందు జాగ్రత్తలతో ఉత్తమ ఫలితాలు 

అమ్మ క్యాంటీన్లలో రెండు రోజులు భోజనం ఉచితం

సాక్షి, చైన్నె: చైన్నెలో సాధారణ పరిస్థితుల కల్పనే లక్ష్యంగా రాత్రికి రాత్రే పారిశుద్ధ్య కార్మికులు, వివిధ విభాగాల సిబ్బంది, అధికారులు, స్వచ్ఛద సేవకులు పడ్డ శ్రమకు ఫలితం దక్కిందని, వీరందర్నీ ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్‌ తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ముందు జాగ్రత్తలతో పెను నష్టం నుంచి గట్టెక్కినట్టు వివరించారు. ప్రధానంగా వర్షపు నీటి కాలువల నిర్మాణాల రూపంలో అధిక శాతం ఫలితాలు దక్కినట్లు పేర్కొన్నారు. 

వివరాలు.. సీఎం ఎంకే స్టాలిన్‌ బుధవారం చైన్నె గిండి రేస్‌ క్లబ్‌ పరిసరాలు, వేళచ్చేరి, పళ్లికరణై పరిసరాలలో పర్యటించారు. వీరంగల్‌ వాగు, నారాయణపురం చెరువు పరిసరాల్లో వర్ష ముంపునకు గురైన ప్రదేశాలను పరిశీలించారు. గిండీ రేస్‌ క్లబ్‌ పరిసరాలలో ఇటీవల ప్రభుత్వం సీజ్‌ చేసిన 118 ఎకరాల స్థలంలో 4.24 క్యూబిక్‌ మిలియన్ల నీటిని నిల్వ ఉంచేందుకు వీలుగా జరుగుతున్న నాలుగు చెరువుల నిర్మాణ పనులను పరిశీలించారు. వీటిని సుందరంగా పార్కు తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఈ చెరువుల పనులు పూర్తి కాగానే పిళ్లయార్‌ కోయిల్‌ వీధి, మదువాంకరై, ఐదు అడుగుల రోడ్డు , వంటి కారన్‌ వీధి, రేస్‌ క్లబ్‌ ఇన్నర్‌ రోడ్డు, వేళచ్చేరి మెయిన్‌ రోడ్డులలో వర్షపు నీరు నిల్వ ఉండేందుకు ఆస్కారం లేదని సీఎంకు అధికారులు సూచించారు. 

ఈ నీళ్లన్నీ చెరువులలోకి మళ్లించే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఈ చెరువల కారణంగా ఆ పరిసరాలలో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. గిండి పరిసరాలలో పూడిక తీత పనులు, వేళచ్చేరి వాగు ప్రవాహం, నారాయణపురం చెరువులోకి ఇన్‌ ఫ్లో, పూడికతీత, పళ్లికరణై నుంచి సముద్రంలోకి నీళ్లు వెళ్లేందుకు వీలుగా బకింగ్‌హామ్‌ కెనాల్‌ వద్ద జరుగుతున్న పనులను సీఎం పరిశీలించారు. ఈ పనులను త్వరితగతిన ముగించాలని అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా మీడియాతో సీఎం మాట్లాడుతూ, అధికారులు, కార్మికులు రేయింబవళ్లు శ్రమించడంతో నగరంలో మెజారిటీ శాతం ప్రాంతాలలో నీళ్లు పూర్తిగా తొలగినట్టు వివరించారు. వీరందరికీ తన అభినందనలు చెబుతున్నానని పేర్కొన్నారు. 

ఇంకా కొన్ని చోట్ల పనులు జరుగుతున్నాయని, వాటన్నింటినీ సకాలంలో పూర్తి చేస్తామన్నారు. చైన్నె, శివారు వాసులకు వరదల నుంచి శాశ్వత పరిష్కారమే తన లక్ష్యమని ఆ దిశగా ముందుకెళ్తామన్నారు. వర్షపు నీటి కాలువలు నష్టం తీవ్రతను తగ్గించాయని అన్నారు. గత మూడు నెలలుగా తాము తీసుకున్న ముందు జాగ్రత్తలకు ఫలితం దక్కిందన్నారు. ఈ పర్యటనలో సీఎంతో పాటుగా మంత్రులు కె.ఎన్‌. నెహ్రూ, ఎం. సుబ్రమణియన్‌, ఎంపీ తమిళచ్చి తంగపాండియన్‌, శాసనసభ సభ్యులు అరవింద్‌ రమేష్‌, అసన్‌ మౌలానా, చైన్నె కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ మహేష్‌ కుమార్‌, రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అముద, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ నీటి సరఫరా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కార్తికేయన్‌, చైన్నె కార్పొరేషన్‌ కమిషనర్‌ కుమారగురుబరన్‌ ఉన్నారు. 

ముందుగా సీఎం సామాజిక మాధ్యమంలో ఈమేరకు ట్వీట్‌ చేశారు. ఇందులో నిన్న కురిసిన భారీ వర్షానికి ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరిగాయని వివరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సహాయక శిబిరాల్లోనే ఉన్నారని, వీరందరికీ అన్ని రకాల ఆహారం చైన్నె కార్పొరేషన్‌ అందించిందని పేర్కొన్నారు. శ్రమించిన ప్రతి ఒక్కరికి అభినందనలు అని వ్యాఖ్యలు చేశారు. బుధ, గురువారాల్లో అమ్మ క్యాంటీన్లలో అన్ని రకాల ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్ణయించామని ప్రకటించారు.

అదే శ్వేతపత్రం అనుకోండి..

వరద ముంపునకు గురైన బాధిత ప్రాంతాలలో బుధవారం డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ పర్యటించారు. సెంట్రల్‌ చైన్నె పరిధిలో జరుగుతున్న సహాయక పనులను పర్యవేక్షించారు. ట్రిప్లికేన్‌లో పారిశుధ్య కార్మికులకు స్నాక్స్‌, బ్రెడ్‌ అందజేశారు. వారికి కావాల్సిన ఉపకరణలను అందజేశారు. వైద్యశిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ అన్ని ముందస్తు పనులతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగ లేదని వివరించారు. నగరంలో వరద నీరు మెజారిటీ ప్రాంతాలలో తొలగినట్టు వివరిస్తూ , దీనినే శ్వేతపత్రంగా భావించుకోండి అని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి హితవు పలికారు. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం వెంట ఎంపీ దయానిధి మారన్‌ ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నారాయణపురం చెరువును  పరిశీలిస్తున్న సీఎం స్టాలిన్‌1
1/1

నారాయణపురం చెరువును పరిశీలిస్తున్న సీఎం స్టాలిన్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement