పంచాయతీ అధ్యక్షురాలిగా పునర్నియమించండి
– జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం
తిరువళ్లూరు: పంచాయతీ అద్యక్షురాలి పదవి నుంచి సునీత బాలయోగిని తొలగిస్తూ కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు, 8 వారాల్లో ఆమెకు బాధ్యతలను తిరిగి అప్పగించాలని ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాలను మాజీ అధ్యక్షురాలు సునీత, పీఎంకే కౌన్సిలర్ దినేష్‌కుమార్ తదితరులు కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్‌కు అందజేశారు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ వెంగత్తూరు పంచాయతీ అధ్యక్షురాలిగా సునీత బాలయోగీ గత ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా రెండవ సారి విజయం సాధించారు. అయితే పంచాయతీలో నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగంపై విచారణ జరిపి గత జనవరిలో ఆమెను పదవి నుంచి కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ తొలగించారు. అయితే కలెక్టర్ నిర్ణయం ఏకపక్షంగా ఉందని, అసలు తాము నిధులను దుర్వినియోగమే చేయలేదని పదవి నుంచి తొలగించబడిన సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ ముగిసిన క్రమంలో హైకోర్టు ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది. సునీత బాలయోగిని పదవి నుంచి తొలగిస్తూ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టేసింది. దీంతోపాటు 8 వారాల్లోపు ఆమెకు బాధ్యతలను అప్పగించాలని ఆదేశించారు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాలను సునీత బాలయోగి, పీఎంకే జిల్లా కార్యదర్శి దినేష్‌కుమార్ తదితరులు కలెక్టర్‌కు అందజేశారు. తమకు తక్షణమే భాద్యతలు అప్పగించేలా చూడాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్టు సునీత బాలయోగి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment