‘జాతకం’ పేరిట దూరం పెట్టడంతో చంపేశా! | - | Sakshi
Sakshi News home page

‘జాతకం’ పేరిట దూరం పెట్టడంతో చంపేశా!

Published Fri, Nov 22 2024 1:51 AM | Last Updated on Fri, Nov 22 2024 1:51 AM

‘జాతకం’ పేరిట దూరం పెట్టడంతో చంపేశా!

‘జాతకం’ పేరిట దూరం పెట్టడంతో చంపేశా!

● మదన్‌ కుమార్‌ వాంగ్మూలం ● న్యాయం కోసం ఉపాధ్యాయుల ఆందోళన

సాక్షి, చైన్నె: నెలకు రూ. లక్ష జీతం వదిలి.. చిన్ననాటి నుంచి ప్రేమిస్తున్న ప్రియురాలిని పెళ్లి చేసుకునేందుకు వచ్చిన ప్రియుడు ఉన్మాదిగా మారి కటకటాల పాలయ్యాడు. జాతకం పేరిట తనను దూరం పెట్టడంతోనే చంపేశానని టీచర్‌ను మట్టుబెట్టిన ప్రేమోన్మాది మదన్‌ కుమార్‌ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. వివరాలు.. తంజావూరు జిల్లా పట్టు కోట్టై సమీపంలోని మల్లి పట్టినం గ్రామంలో ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో బుధవారం జరిగిన ఘటన యావత్‌ ఉపాధ్యాయ లోకాన్ని కలవరంలో పడేసిన విషయం తెలిసిందే. మల్లి పట్టినం సమీపంలోని చిన్నమనై గ్రామానికి చెందిన తమిళ టీచర్‌ రమణి (26)ను అదే ప్రాంతానికి చెందిన మదన్‌ కుమార్‌ ప్రేమోన్మాదంతో పొడిచి చంపేశాడు. ఈ ఘటనతో ఉపాధ్యాయులకు భద్రత కల్పించాలన్న నినాదంతో ఆందోళనలు బయలు దేరాయి. ప్రాథమిక, ఉన్నత, మహోన్నత పాఠశాలలకు చెందిన అనేక మంది ఉపాధ్యాయులు గురువారం సాయంత్రం విద్యా శాఖ కార్యాలయాల వద్ద భద్రత కోసం ఆందోళనకు దిగారు. అదే సమయంలో ప్రేమోన్మాది వద్ద పోలీసులు జరిపిన విచారణలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రమణితో తనది ఒన్‌ సైడ్‌ లవ్‌ కాదని, ఇద్దరం ప్రేమించుకున్నామని, ఎన్నో కలలు కన్నామని అతడు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. రమణి కోసం సింగపూర్‌లో తాను నెలకు రూ. లక్ష జీతంతో చేస్తున్న ఉద్యోగాన్ని సైతం కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. తమ పెళ్లికి జాతకం అడ్డు వచ్చిందని, ఇదే అదనుగా తనను దూరం పెట్టడంతో మానసిక క్షోభకు గురైనట్లు వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. జాతకంతో పని లేదని, పెళ్లి చేసుకుందామని నచ్చ చెప్పినా వినిపించుకోక పోవడంతో ఉన్మాదిగా మారి పోయి హతమార్చేశానని అతడు కన్నీటి పర్యంతం అవుతూ, తామిద్దరం తీసుకున్న ఫొటోలను పోలీసులకు అందజేయడం గమనార్హం.

మదురైలో మరో ఉన్మాది..

టీచర్‌ను ప్రేమోన్మాదంతో హతమార్చిన మదన్‌కుమార్‌ ఘటన కలకలం సద్దుమనగక ముందే మదురైలో ఒత్తకడైలో మరో ఘటన వెలుగు చూసింది. జెరాక్స్‌ దుకాణంలో పనిచేస్తున్న లావణ్య అనే యువతి, సిద్ధిక్‌ రాజా అనే యువకుడు ప్రేమించుకున్నట్టు సమాచారం. వీరి ప్రేమకు హఠాత్తుగా బ్రేక్‌ పడడంతో సిద్దిక్‌ రాజా ఉన్మాదిగా మారాడు. జెరాక్స్‌ దుకాణంలో ఉన్న లావణ్య మీద పిడి గుద్దుల వర్షం కురిపించాడు. దీనిని చూసిన ఆ పరిసర వాసులు ఆమెను చికిత్స నిమిత్తం మదురై రాజాజీ ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాల పాలైన ఆమెకు మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. పరారీలో ఉన్న సిద్ధక్‌ రాజా కోసం గాలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement