సంతానం లేదని మహిళ ఆత్మహత్య
అన్నానగర్: చైన్నె తిరుమంగళం బడికుప్పానికి చెందిన కార్తికేయన్ (32) కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడికి చింతాద్రిపేట దేవరాజ్ వీధికి చెందిన శాంతి (27)తో 2021లో వివాహమైంది. వీరికి పిల్లలు లేరు. దీంతో భార్యా భర్తలిద్దరూ పలు ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. అయినా ఉపయోగం లేదని తెలుస్తోంది. సంతానం లేదని శాంతి మానసికంగా బాగా ప్రభావితమైంది. ఇందుకోసం సైక్రియాట్రిక్ డాక్టర్ వద్ద చికిత్స పొందుతూ నిత్యం మాత్రలు తింటున్నట్లు తెలుస్తోంది. గత జూలైలో శాంతి తల్లి అనారోగ్య సమస్యలతో మరణించింది. అప్పటికే పిల్లలు లేరని మనస్తాపంతో ఉన్న శాంతి తల్లి మృతితో మరింత కుంగిపోయింది. దీంతో శాంతి సరిగ్గా మాత్రలు వేసుకోవడం లేదు. కొద్దిరోజుల క్రితం శాంతి చింతాద్రిపేటలోని తన తల్లి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో శాంతి గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై చింతాద్రిపేట పోలీసులు కేసు నమోదు చేసి శాంతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజీవ్‌గాంధీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంక ఆమెకి పైళ్లె మూడేళ్లు అయినందున, ఆర్డీఓ విచారణకు కూడా సిఫార్సు చేశారు.
గాయపడ్డ యువకుడు మృతి
అన్నానగర్: రైలు ఢీకొని గాయపడ్డ ఓ యువకుడు చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. చైన్నెలోని జాఫర్‌ఖాన్‌పేటకు చెందిన శంకర నారాయణన్ కుమారుడు హరీష్ (19). చైన్నెలోని పల్లవన్‌తాంగల్ సమీపంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్నాడు. 16వ తేదీన హరీష్ కాలేజీ అయిపోయాక ఇంటికి వెళ్లేందుకు రైల్వేస్టేషన్‌న్‌కు వెళుతున్నాడు. పరంగిమలై–పల్లవన్‌తాంగల్ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. ఆసమయంలో తాంబరం నుంచి బీచ్ వైపు వెళుతున్న ఎలక్ట్రిక్ రైలు హరీష్‌ను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడ్డ అతన్ని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ హరీష్ గురువారం ఉదయం మృతిచెందాడు. మాంబలం రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆలయానికి చెందిన రూ.మూడున్నర కోట్ల ఆస్తుల రికవరీ
అన్నానగర్: హిందూ రెలిజియస్ ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో చైన్నెలోని తిరువల్లికేణి తీర్థపలీశ్వర ఆలయానికి చెందిన 560 చదరపు అడుగుల కమర్షియల్ ప్లాట్, 2,886 చదరపు అడుగుల రెసిడెన్షియల్ ప్లాట్ సహా మొత్తం 3,446 చదరపు అడుగుల ఆస్తిని అసిస్టెంట్ కమిషనర్ కె. భారతీరాజా పర్యవేక్షణ లో దేవదాయ శాఖ, పోలీసు శాఖ సహకారంతో రికవరీ చేసి ఆలయానికి అప్పగించినట్లు పేర్కొన్నారు. వాటి విలువ రూ. మూడున్నర కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ (దేవాలయ భూములు) తిరువెంక డ్యాం, ఆలయ కార్యనిర్వహణాధికారి రమేష్, ఇన్వెంటరీ ఇన్‌స్పెక్టర్ ఉష, స్పెషల్ డ్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారులు కుమరేశన్, సెంథిల్, దినకరన్, నిత్యానందం, సుశీల్‌కుమార్ పాల్గొన్నారు.
దివ్యాంగ బాలికకు వైద్యపరీక్షలు
కొరుక్కుపేట: చైన్నెలోని అన్నారోడ్‌లో చదువుతున్న ఓ కళాశాల విద్యార్థినిపై పాఠశాల, కళాశాల విద్యార్థినులు ఏడుగరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే విషయం వెలుగులోకి రావడంతో.. చింతాద్రి పేట మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఐదుగురిని అరెస్టు చేసి జైలు కు తరలించారు. మరో యిద్దరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు లైంగిక వేధింపులకు గురైన విద్యార్థినికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. తనకు జరిగిన వేధింపులపై విద్యార్థిని ఇప్పటికే పోలీసులకు వాంగ్మూలం ఇవ్వగా, బాలిక ఇప్పుడు మెజిస్ట్రేట్‌కు కూడా వాంగ్మూలం ఇచ్చింది. ఇవన్నీ క్రిమినల్ కేసులో కీలక ఆధారాలుగా పోలీసులు సేకరించారు. కోర్టులో విచారణను వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్ష విధించాలని విధించేలా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
మత్తుమాత్రల విక్రయం కేసులో ఇద్దరి అరెస్ట్
తిరువొత్తియూరు: చైన్నె ,సేతుపట్టు ప్రాంతంలో గంజా, మత్తుమాత్రలు విక్రయిస్తున్న కళాశాల విద్యార్థి ఆకాష్, కార్పొరేషన్ కాంట్రాక్టు ఉద్యోగి వినోద్ అనే ఇద్దరిని పోలీసులు గురువారం ఉదయం అరెస్టు చేశారు. అలాగే బుధవారం రాత్రి చైన్నె బీసెంట్ నగర్ సముద్రతీరం ప్రాంతంలో మెథా బెటమైన్ అనే మత్తు పదార్థాలు విక్రయించిన కేరళ రాష్ట్రానికి చెందిన రమేష్, ఇషాక్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
చెత్త వేయొద్దంటూ ఆందోళన
తిరువొత్తియూరు: చైన్నె, ఆలందూరు 12వ మండలం 166వ వార్డుకు సంబంధించిన నెహ్రూ హైవేలో వరంగిమలై కంటోన్మెంటు బోర్డుకు సొంతమైన 15 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఇందులో ఫరంగి ప్రాంతంలో సేకరిస్తున్న చెత్తకుప్పలను, అలాగే నంగ నల్లూరు, పలవన్ తాంగల్ ప్రాంతాల్లో సేకరిస్తున్న చెత్త కుప్పపోస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పారిశుధ్యం లోపించడంతో స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో స్థానిక ప్రజలు గురువారం ఇక్కడ చెత్తకుప్పలను వేయవద్దని ఆందోళన చేస్తూ లారీని ముట్టడించారు. పోలీ సులు వారికి సర్దిచెప్పి పంపించి వేశారు.
Comments
Please login to add a commentAdd a comment