విజయ్‌ను తొక్కేయాలనుకోవడం న్యాయం కాదు
తమిళసినిమా: రూ. 200 కోట్ల పారితోషికాన్ని కాదనుకొని ప్రజాసేవ చేయాలనుకుంటున్న నటుడు విజయ్‌ను అణగతొక్కేయాలని అనుకోవడం న్యాయం కాదని సీనియర్ నటుడు, దర్శకుడు పార్తీపన్ పేర్కొన్నారు. కోలీవుడ్‌లో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్న విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈయన 2026లో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శుక్రవారం పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ డీఎంకే అనేది నిన్న మొలిసిన పార్టీ కాదన్నారు. అయితే రాజకీయ పార్టీని ప్రారంభించిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కొందరు భావిస్తున్నారన్నారు. తదుపరి వచ్చేది తమ ప్రభుత్వమేనని, తదుపరి ముఖ్యమంత్రి తానేనని కొందరు చెప్పుకుంటూ తిరుగుతున్నారన్నారు. ముఖ్యమంత్రి విజయం గురించే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా సాందూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు పార్తీపన్‌ను ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా కోరిన మీడియాతో ఆయన మాట్లాడుతూ అసలు నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరమే లేదన్నారు. సినిమాలో అగ్ర స్థానంలో రాణిస్తున్న ఆయన రూ. 200 కోట్ల పారితోషికాన్ని కాదనుకుని ప్రజలకు ఏదో చేయాలన్న భావనతో వస్తున్న ఆయన్ని ఆరంభంలోనే అణగదొక్కే ప్రయత్నం చేయడం న్యాయం కాదన్నారు. మనది ప్రజాస్వామ్య దేశమని ఇక్కడ ఫలానా వారే ప్రభుత్వాన్ని పాలించాలని, ఇతరులు ఎవరు రాజకీయాల్లోకి రాకూడదని, ప్రజల కోసం సేవ చేయకూడదని చెప్పే హక్కు ఎవరికీ లేదని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment