ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మారి కథ ముగిసినట్టేనా? వేల సంఖ్యలో రోజువారీ కేసులు, ఆక్సిజన్ కొరతలు, ఆసుపత్రి చేరికలు ఇక గతకాలపు మాటేనా? కావచ్చు.. కాకపోనూవచ్చని అంటున్నారు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ వినయ్ నందికూరి. మారుతున్న వాతావరణ పరిస్థితులు.. నగరీకరణ, జంతు ఆవాసాల విస్తృతి తగ్గిపోతుండటం వంటి వాటి వల్ల భవిష్యత్తులోనూ జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సోకుతూనే ఉంటాయని ఆయన తెలిపారు. దేశంలో కోవిడ్ నియంత్రణలో కీలకపాత్ర పోషించిన వినయ్.. ‘సాక్షి’తో కోవిడ్ తదనంతర పరిస్థితులపై తన ఆలోచనలను పంచుకున్నారు!
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కథ ఇక ముగిసినట్టేనా?
జవాబు: వైరస్ వ్యాధుల విషయంలో ముగింపు ఉండదు. దశాబ్దాలుగా వచ్చిపోతున్న ఫ్లూ మాదిరిగానే కోవిడ్ కూడా అప్పుడప్పుడూ మనల్ని పలకరిస్తుంటుంది. సాధారణంగా ఇలాంటి వైరస్‌లు కాలక్రమంలో నెమ్మదిస్తాయి. కొన్ని ప్రాంతాలకే పరిమితమైతే ఎండమిక్ అని, తరచూ కొన్నిచోట్ల వస్తుంటే ఎపిడమిక్ అని పిలుస్తారు. కోవిడ్ ఇకపై ఎపిడమిక్ స్థాయిలో కొనసాగుతుందని అంచనా.
కోవిడ్ వైరస్ జన్యుక్రమం గురించి తెలుసుకొని మనం ఏం నేర్చుకోగలిగాము?
►జన్యుక్రమాల ద్వారా నిత్యం ఒక మహమ్మారి వైరస్‌ను పరిశీలించడం కోవిడ్‌తోనే మొదలైంది. వేల జన్యుక్రమాలను నమోదు చేయడం వల్ల వైరస్‌లో వచ్చే అతిసూక్ష్మ మార్పులనూ గుర్తించేందుకు వీలు ఏర్పడింది. ప్రొటీన్ కొమ్ములోని ఏ భాగంలో మార్పులొస్తే ఏ రకమైన లక్షణాలు రాగలవో అంచనా వేయవచ్చు. పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడమూ సాధ్యమైంది. భవిష్యత్తును అంచనా వేయడమూ వీలవుతోంది.
భారతీయ పరిశోధనల్లో వచ్చిన మార్పులేంటి?
►కోవిడ్ వంటి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు వెచ్చించడంతో మునుపెన్నడూ భారతీయ శాస్త్రవేత్తలు చేయని పనులను చేపట్టారు. జన్యుక్రమాల నమోదు, అత్యవసరంగా టీకా తయారీ వంటివన్నీ ఈ కోవకు చెందుతాయి. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇప్పటికీ పదో వంతు మంది శాస్త్రవేత్తలు కూడా లేరు. పాశ్చాత్య దేశాల్లో నిర్దిష్ట సమస్య పరిష్కారం లక్ష్యంగా వందల మంది శాస్త్రవేత్తలు పనిచేస్తుంటారు. భారత్‌లో అలాంటి పరిస్థితి లేదు. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థల మధ్య సహకారం మరింత పెరిగింది.
సీసీఎంబీ మాతృసంస్థ సీఎస్‌ఐఆర్‌కు ఉన్న 35కుపైగా ల్యాబ్స్ మధ్య పరిశోధనల్లో పరస్పర సహకారం ఉందా?
►సీఎస్‌ఐఆర్ ల్యాబ్స్ అన్నీ ఒక అంశంపై సహకరించుకోవడం అన్నది ఆచరణసాధ్యమైన విషయం కాదు. కానీ కోవిడ్ సమయంలో ఆక్సిజన్ ఉత్పత్తి మొదలుకొని వైరస్‌ను చంపేందుకు ఉన్న మార్గాల వరకూ అనేక అంశాల్లో సీఎస్‌ఐఆర్‌లోని పలు సంస్థలు కలిసికట్టుగా పనిచేశాయి. మంచి ఫలితాలు సాధించాయి కూడా. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్టుల్లోనూ పలు సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి.
జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులు ఎక్కువవుతున్నాయి. వాటిని ఎదుర్కోవడం ఎలా?
►ఇటీవలి కాలంలో మనుషులకు, జంతు ఆవాసాలకు మధ్య దూరం బాగా తగ్గిపోవడంతో జంతువుల్లోని వ్యాధులు మనుషులకు సోకుతున్నాయి. అలాగే వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు కూడా వ్యాధులు ఎక్కువయ్యేందుకు కారణమవుతోంది. వాటిని ఎదుర్కోవడం ఎలా? అన్న ప్రశ్నకు ‘వన్ హెల్త్’ కార్యక్రమం సమాధానం చెబుతోంది. మానవ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా... వాతావరణ పరిస్థితులు, జంతువుల ఆరోగ్యంపై నిత్యం నిఘా పెట్టడం క్లుప్తంగా వన్ హెల్త్ లక్ష్యం.
దేశంలో క్షయను పూర్తిగా నివారించాలన్న లక్ష్యాన్ని అందుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులేమిటి?
►క్షయవ్యాధిని మటుమాయం చేసేందుకు టీకా కచ్చితంగా కావాలి. దీనికోసం చాలా ప్రయత్నాలు జరిగాయి కానీ పూర్తిస్థాయిలో విజయం సాధించలేదు. దేశంలో క్షయ వ్యాధి నివారణకు ప్రస్తుతం 6–9 నెలల కార్యక్రమం నడుస్తోంది. వ్యాధి నయమవ్వాలంటే మందులను క్రమం తప్పకుండా వాడటం, పోషకాహారం తీసుకోవడం వంటివి కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అయితే రకరకాల కారణాల వల్ల ఇవి అమలు కావడం లేదు. అందుకే వ్యాధి నివారణ కష్టతరమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment