సాక్షి, సిటీబ్యూరో: గతకొంత కాలంగా సిటీజన్లకుకంటిమీద కునుకు లేకుండా చేసిన కరోనా వైరస్‌క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో గ్రేటర్‌వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వైరస్‌పై ప్రజల్లో పూర్తిఅవగాహన ఏర్పడింది. దగ్గు, జలుబు, జ్వరం వంటిఏ ఒక్క లక్షణం ఉన్నట్లు అనుమానం కలిగినా వెంటనే జాగ్రత్త పడుతున్నారు. టెస్టులు చేయించుకుంటున్నారు. ఇతరులకు వైరస్ విస్తరించకుండా చూస్తున్నారు.
రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ
కషాయాలు తాగుతూ, పౌష్టికాహారం తీసుకుంటున్నారు. దీంతో వైరస్ విస్తరణ తగ్గుముఖం పట్టడంతో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది.
అయినప్పటికీ సిటీజన్లు అత్యవసరం అయితేనే బయటికి వస్తున్నారు. ఇదిలా ఉంటే....తాజాగా మంగళవారం జీహెచ్‌ఎంసీలో 338 పాజిటివ్‌కేసులు నమోదు కాగా, మేడ్చల్‌లో 119, రంగారెడ్డిలో 147 పాజిటివ్ నమోదయ్యాయి. కోర్‌సిటీలో కేసుల సంఖ్య తగ్గుతుంటే...శివారు జిల్లాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.
శివారులో కేసుల జోరు
మార్చి రెండో తేదీన హైదరాబాద్‌లో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. మార్చి చివరి నాటికి 74 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ఆరుగురు మృతి చెందారు. ఏప్రిల్‌లో 527 పాజిటివ్ కేసు లు నమోదు కాగా, యాభై మందికిపైగా మృతి చెందారు. ఇక మేలో 1015 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో మృతుల సంఖ్య రెట్టింపైంది. లాక్‌డౌన్ నిబంధనలు సడలించడంతో సిటీకి రాకపోకలు పెరిగాయి. కంటైన్మెంట్ జోన్ల ఎత్తివేతతో జనం మార్కెట్లు, ఆఫీసులు, పుట్టిన రోజు, వివిధ రకాల వేడుకల పేరుతో ఇష్టం వచ్చినట్లు తిరిగారు. ఇదే సమయంలో వైద్య ఆరోగ్య శాఖ క్రేసుల ట్రేసింగ్‌ను నిలిపివేసింది. వైరస్ కట్టడి చేసే విషయంలో అధికారులు దాదాపుగా చేతు లెత్తేశారు. దీంతో జూన్‌లో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ నెలలో 11080 పాజిటివ్ కేసులు నమోదైతే...200 మందికిపైగా మృతి చెందారు. ఇక జులైలో వైరస్ మరింత విజృంభిం చింది. 26082 కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 500 దాటింది. ఆగస్టులో కేవలం పది రోజుల వ్యవధిలోనే 4502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీతో పోలిస్తే శివారులోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగి స్తుంది.
టెస్టులు పెంచడంతో...అప్రమత్తం
గతంలో రోజుకు ఐదు వేల టెస్టులు మాత్రమే చేసిన ప్రభుత్వం జులై 8 తర్వాత ర్యాపిడ్ టెస్టులను అందుబాటులోకి తెచ్చింది. ఈ సంఖ్యను రోజుకు 20 వేల వరకు పెంచింది. ఈ ప్రక్రియ వేగవంతం కావడంతో అనుమానం ఉన్నవారంతా వచ్చి టెస్టులు చేయించుకోవడం, లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉన్నవారు ఆస్పత్రిలో చేరి చికిత్సలు పొందగా, ఏ లక్షణాలు లేక పోయినా పాజిటివ్ నిర్ధారణ అయిన వారు హోం ఐసోలేషన్‌లో ఉండి వైరస్ నుంచి బయటపడ్డారు. వ్యక్తిగత జాగ్రత్తలకు తోడు, పౌష్టికాహారం తీసుకోవడంతో అనేక మంది ప్రాణాపాయ భయం నుంచి బయటపడ్డారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి వైరస్ ఇతరులకు విస్తరించకుండా జాగ్రత్త పడ్డారు. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణమని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సగానికిపైగా కేసులు జీహెచ్‌ఎంసీలోనే..
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 82647 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 43280 పాజిటివ్ కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. అంతే కాదు ఇప్పటి వరకు 645 మంది మృతి చెందగా, వీరిలో 550 మంది వరకు జీహెచ్‌ఎంసీ వారే. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 59374 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 22628 యాక్టివ్ కేసులు ఉండగా, వీటిలో 5000పైగా కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనివే. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 2629 మంది చికిత్స పొందుతుండగా, మిగిలిన వారంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అంతేకాదు తెలంగాణ వ్యాప్తంగా 56 ప్రభుత్వ ఆస్పత్రులు, 112 ప్రైవేటు ఆస్పత్రుల్లో మొత్తం 20396 పడకలు ఉండగా, వీటిలో 17767 పడకలు ఖాళీగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment