కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ @ రూ.28 వేలు | COVID 19 Treatment Just 28 Thousand Rupees in Jain International | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ @ రూ.28 వేలు

Published Thu, Aug 6 2020 9:53 AM | Last Updated on Thu, Aug 6 2020 1:46 PM

COVID 19 Treatment Just 28 Thousand Rupees in Jain International - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్‌ వైద్యం అత్యంత ఖరీదైపోయింది.ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రులు రూ. లక్షల్లో వసూలు చేస్తున్నాయి. సాధారణ దగ్గు, జలుబు,జ్వరం వంటి లక్షణాలు ఉండి కోవిడ్‌ పేషెంట్‌ అయితే చాలు  నిలువుదోపిడీకి  పాల్పడుతున్నాయి. కరోనా  వైరస్‌ బారిన పడిన వారు  జబ్బుతో వచ్చే బాధలకంటే వైద్యానికి అయ్యే ఖర్చును తలచుకొని విలవిల్లాడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో  ఆసుపత్రిలో చేరి చివరకు మృత్యువాత పడినా సరే వదిలిపెట్టకుండా కుటుంబ సభ్యులను, బంధువులను డబ్బుల కోసం  వేధిస్తున్న ‘కాసుపత్రుల’ అమానవీయ ఉదంతాలు  భయాందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు సర్కార్‌ దవఖానాలు  పేషెంట్‌లకు గట్టి భరోనాను ఇవ్వలేకపోతున్నాయి. కనీస సౌకర్యాలు కూడా లేని  సర్కార్‌ దవాఖానాల్లో చేరేందుకు జనం వెనుకడుగు వేస్తున్నారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన కార్పొరేట్‌ స్థాయి వైద్య సేవలను అందజేసేందుకు వంద  పడకల ‘ కోవిడ్‌కేర్‌ సెంటర్‌’తో ముందుకు వచ్చింది జైన్‌ ఇంటర్నేషనల్‌ స్వచ్చంద సంస్థ. దాతల సహాయ సహకారాలతో పని చేస్తున్న ఈ సంస్థ  విద్య, వైద్య రంగాల్లో తన సేవాకార్యక్రమాలను కొనసాగిస్తోంది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైరస్‌ బారిన పడ్డారు. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి ఆపద సమయంలో  బాధితులను ఆదుకొనేందుకు ఈ సంస్థ  దేశవ్యాప్తంగా  ఇప్పటికే  15  కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసింది. తాజాగా   16వ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. బేగంపేట్‌లోని మానస సరోవర్‌లో  100  పడకలతో, అన్ని రకాల సదుపాయాలతో ఈ ఆసుపత్రిని  బుధవారం అందుబాటులోకి  తెచ్చారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా, వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ  ఆసుపత్రిలో కోవిడ్‌ బాధితులకు  వైద్య సేవలు లభిస్తాయి. కేవలం నామమాత్రపు ఫీజులతో అన్ని రకాల సదుపాయాలు కల్పించనున్నట్లు  జైన్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌  ప్రతినిధి వినోద్‌ రాంకా  తెలిపారు. 

ఇవీ ప్రత్యేకతలు... 
బేగంపేట్‌ చిరాగ్‌ఫోర్ట్‌లో ఉన్న మూడంతస్తుల మానససరోవర్‌ హాటల్‌ను జైన్‌ ఇంటర్నేషనల్‌ ప్రస్తుతం కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ గా  ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది.  
మొదటి, రెండో అంతస్తులలో  100 పడకలను ఏర్పాటు చేశారు.  
కోవిడ్‌ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయిన వారు ఈ ఆసుపత్రిలో చేరవచ్చు.  
ఒక గదిలో ఇద్దరు  చొప్పున ఉంటే  వారం రోజులకు ఒక్కొక్కరు రూ.28000 చొప్పున చెల్లిస్తే చాలు. 
ఒక్కరే  ప్రత్యేకంగా ఒక సింగిల్‌ రూమ్‌లో ఉండాలనుకొంటే  వారం రోజులకు రూ.35000 ఫీజు ఉంటుంది.  
ఈ ఫీజులోనే కోవిడ్‌ నివారణకు అవసరమయ్యే మందులు, చికిత్స, ఆక్సిజన్‌ (అవరమైన వారికి), తదితర అన్ని సదుపాయాలు లభిస్తాయి. 
పేషెంట్‌లు త్వరగా కోలుకొనేందుకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందజేస్తారు. అయితే కేవలం శాఖాహారం మాత్రమే ఇస్తారు.  
రోగులలో షుగర్, హైబీపీ, కిడ్నీ సమస్యలు  వంటి జబ్బులతో బాధపడేవాళ్లు ఉంటే వారి కోసం  ఆహారంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు.  
ఆసుపత్రిలో చేరే సమయంలోనే తమకు ఉన్న ఇతర సమస్యలను కూడా బాధితులు స్పష్టంగా నమోదు చేయాలి.  

నిరంతరం వైద్య సేవలు
ఈ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆరుగురు వైద్య నిపుణులు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తారు. అలాగే నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది రోగులను కనిపెట్టుకొని ఉంటారు.  
అంబులెన్స్‌ సదుపాయం ఉంటుంది.  
అత్యవసర పరిస్థితుల్లో  రోగులను  పెద్ద ఆసుపత్రులకు తరలించే సేవలు ఉంటాయి. 
ఈ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఆక్సిజన్‌ మాత్రమే అందుబాటులో ఉంటుంది. వెంటిలెటర్‌లు ఉండవు. రోగికి వెంటలెటర్‌ అవసరమైతే మాసాబ్‌ట్యాంకులోని  మహావీర్‌ ఆసుపత్రిలో తక్కువ చార్జీల్లోనే  వెంటిలెటర్‌ సదుపాయంతో కూడిన వైద్యాన్ని అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

హెల్ప్‌లైన్‌ నెంబర్లు 
91211 55500
91212 55500  
91213 55500 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement