ఇప్పటికే 15 ఈ తరహా దుకాణాలు
నిత్యావసర సరుకులు సహా
చిరు ధాన్యాలు, పప్పులు లభ్యం
గ్రేటర్ నగరంలో పైలట్
ప్రాజెక్టుగా అమలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మరో 30 ప్రభుత్వ చౌక ధరల దుకాణాలు త్వరలో జన్ పోషణ్ (ప్రజా పోషక) కేంద్రాలుగా మారనున్నాయి. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 15 రేషన్ షాపుల్లో ఇవి కొనసాగుతుండగా.. మరికొన్ని కేంద్రాలను ప్రారంభించేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా మరిన్ని ఉత్పత్తులను ప్రజలకు చేరవేసేందుకు చర్యలు చేపట్టిన విషయం విదితమే. పైలట్ ప్రాజెక్టులో భాగంగా మూడు నెలల క్రితం తొలి విడతలో ప్రారంభించిన కేంద్రాలకు మంచి స్పందన లభిస్తుండటంతో తాజాగా మరో 30 జన్ పోషణ్ కేంద్రాలకు అనుమతించింది. ఎంపిక చేసిన రేషన్ షాపుల డీలర్లకు మూడు రోజులు పాటు సరుకుల విక్రయాలు, నిల్వల తీరుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ కేంద్రాల్లో తృణ ధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసర సరుకులు సహా వివిధ ఉత్పత్తులను విక్రయిస్తారు. దశల వారీగా రేషన్ షాప్‌లను పూర్తిగా ఆధునికీకరించి నిత్యావసర సరుకులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.
తక్కువ ధరల్లోనే..
జన్ పోషణ్ కేంద్రాల్లో నాణ్యమైన సరుకులు తక్కువ ధరకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. బహిరంగ మార్కెట్లో లభించే ధర కంటే తక్కువ ధరకు నాణ్యత కలిగిన నిత్యావసర సరుకులు విక్రయించనున్నారు. ప్రజా పంపిణీ పథకం కింద పంపిణి చేస్తున్న పీడీఎస్ బియ్యం, సబ్సిడీ, గోధుమలు, కిరోసిన్, చక్కెర తదితర వంటివి మినహాయించి, కంది పప్పు, శనగ, పెసర పప్పు, కొర్రలు, సజ్జలు తదితర పోషకాహార సరుకులను విక్రయించే విధంగా ఏర్పాటు చేశారు. సబ్బులు, అగ్గిపెట్టెలు, పప్పులు, పాలు, నూనెలు, ఉప్పు, బెల్లం, ఉల్లిగడ్డలు వంటివి కూడా విక్రయించేందుకు డీల్లకు వెసులుబాటు కలి్పంచారు.
డీలర్లకు ఆర్థిక చేయూత..
రేషన్Œ డీలర్ల ఆదాయాన్ని పెంచేందుకు జన్ పోషణ్ కేంద్రాలు ఎంతో ఉపయోగపడనున్నాయి. ఒకవైపు ప్రజలకు పోషక పదార్థాలు అందించడంతోపాటు డీలర్లకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్రాలు కలిసి వచ్చే విధంగా కేంద్రం చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. వాస్తవంగా ప్రభుత్వ చౌకధరల దుకాణాలు కేవలం పీడీఎస్ బియ్యంతో పాటు సబ్సిడీ సరుకుల పంపిణీకే పరిమితమయ్యాయి. ప్రతి నెలా మొదటి వారం తర్వాత పది రోజులు మాత్రమే నిరీ్ణత సమయంలోనే రేషన్ దుకాణాలు పని చేస్తుంటాయి. మిగిలిన రోజుల్లో సరుకుల పంపిణీ గడువు ముగియడంతో దుకాణాలను మూసివేయడం షరామామూలైంది. దీంతో రేషన్ డీలర్లకు సబ్సిడీ సరుకుల పంపిణీపై వస్తున్న కమీషన్లు కనీసం మడిగ కిరాయికి సైతం సరిపొని పరిస్థితి నెలకొంది. దీంతో దుకాణాల నిర్వహణ కష్టంగా తయారైందని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
6.36 లక్షల కుటుంబాలు
హైదరాబాద్ పౌర సరఫరాల విభాగం పరిధిలో సుమారు 653 రేషన్ షాపులున్నాయి. వీటి పరిధిలో 6.23 లక్షల కుటుంబాలకు ఆహార భద్రత కార్డులున్నాయి. ఇందులో దాదాపు 23.61 లక్షల సభ్యులు ఉన్నారు. ప్రతి నెలా 80 నుంచి 90 శాతం వరకు లబ్ధి కుటుంబాలు సబ్సిడీ సరుకులు డ్రా చేస్తుంటాయి. రేషన్ షాపులు జన్‌పోషణ్ కేంద్రాలుగా మారుతుండటంతో ఇతర నిత్యావసర సరుకులు కూడా కొనుగోలు చేస్తుండటంతో మరింత కలిసి వస్తోంది. దీంతో పౌరసరఫరాల శాఖ మరిన్ని రేషన్‌షాపులను జన్‌పోషణ్ కేంద్రాలుగా మార్చే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment