కింగ్‌పిన్స్ లక్ష్యంగా దాడులకు వ్యూహం
ఇతర రాష్ట్రాల్లోని కీలక వ్యక్తుల జాడ గుర్తింపు
డ్రగ్స్ సోదాల్లోకి నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్స్
120 జాగిలాలకు అత్యాధునిక శిక్షణ
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ ముఠాల కట్టడిపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ ఏఎన్‌బీ) మరింత ఫోకస్ పెట్టింది. మత్తు పదార్థాలు వాడేవారు, సరఫరా చేసే పెడ్లర్ల వరకే పరిమితం కాకుండా.. ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉంటూ డ్రగ్స్ రవాణాలో కీలకంగా వ్యవహరిస్తున్న కింగ్‌పిన్ (కీలక నిందితు)లను కూడా పట్టుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. మత్తు ముఠాలను మూలాల నుంచి పెకిలించేలా మెరుపు దాడులకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోని మాదకద్రవ్యాల కేంద్రాలపై ఆకస్మిక దాడులకు రంగం సిద్ధం చేసినట్టు టీజీఏఎన్‌బీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గతేడాది రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 1,942 ఎన్‌డీపీఎస్ కేసులలో టీజీఏఎన్‌బీ 4,682 మందిని అరెస్ట్ చేసింది. రూ.143 కోట్లు విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది.
మూలాలపై ఫోకస్
మత్తుపదార్థాల రవాణా, విక్రయం వ్యవస్థీకృత నేరంగా మారింది. ఈ దందాలోకి దిగినవారు మళ్లీ బయటికి రాలేక మరింత లోతుకు కూరుకుపోతున్నారు. ఏజెంట్లు కింగ్‌పిన్స్‌గా, కస్టమర్లు సప్లయర్లుగా మారుతూ మరింత ముదిరిపోతున్నారు. ప్రధానంగా గోవా, ముంబై, బెంగళూరులో డ్రగ్స్ కింగ్‌పిన్స్ తలదాచుకుంటున్నారు. హైదరాబాద్‌లో పోలీస్ నిఘా పెరగడంతో నైజీరియన్ గ్యాంగ్ బెంగళూరుకు మకాం మార్చింది. దీంతో హైదరాబాద్‌లో సప్లయర్లు, కస్టమర్లు తప్ప కింగ్‌పిన్స్ చిక్కడం లేదు. ఎప్పటికప్పుడు కొత్తవారి ద్వారా, సరికొత్త మార్గాల్లో సరుకును మార్కెట్‌లోకి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉండి మన రాష్ట్రంలో డ్రగ్స్ దందా నడుపుతున్న కీలక వ్యక్తులపై ఏఎన్‌బీ దృష్టి పెట్టింది.
పట్టుబడిన పెడ్లర్లు, సప్లయర్లు, కస్టమర్లతోపాటు డీఆర్‌ఐ, నార్కోటిక్స్ బ్యూరో నుంచి సేకరించిన డేటా ఆధారంగా టీజీ ఏఎన్‌బీ స్పెషల్ ఆపరేషన్స్‌కు ప్రణాళిక రూపొందించింది. కింగ్‌పిన్స్ స్థావరాలు, వారి మొబైల్ నంబర్లు, ద్వితీయ శ్రేణి సప్లయర్ల వివరాలను సేకరించి, మెరుపు దాడులకు సిద్ధమయ్యారు. సంగారెడ్డి జిల్లాలో పట్టుబడ్డ ఓ డ్రగ్స్ ముఠాకు మహారాష్ట్ర డ్రగ్స్ పెడ్లర్లతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. ఇతర రాష్ట్రాల పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధంచేసింది.
కీలకంగా డాగ్ స్క్వాడ్
అనుమానిత ప్రాంతాల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాలను గుర్తించేందుకు చేసే తనిఖీల్లో బాంబ్ స్క్వాడ్ తరహాలో నార్కోటిక్స్ డాగ్ స్క్వాడ్‌ను కూడా అధికారులు సిద్ధం చేశారు. సుమారు 120 జాగిలాలకు అత్యత్తమ శిక్షణ పూర్తి ఇచ్చారు. వీటిని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, రైళ్లలో తనిఖీ చేసేందుకు ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద సెర్చ్ ఆపరేషన్స్‌లోనూ వీటిని ఉపయోగించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment