పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు
జీహెచ్‌ఎంసీ చట్టప్రకారం అధికారాలెలా కట్టబెడతారని ప్రశ్న
హైడ్రా ఏర్పాటులో చట్టబద్ధత లోపించినట్లు కనబడుతోందని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఏర్పాటును నిలిపివేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 99పై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) చట్ట ప్రకారం హైడ్రాకు అధికారాలను ఎలా కట్టబెడతారని సర్కార్‌ను ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలి తప్ప ఇష్టారాజ్యంగా జీవోలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటులో చట్టబద్ధత లోపించినట్లు కనబడుతోందని పేర్కొంది. ప్రత్యేక చట్టం లేకుండా ఏర్పాటైన హైడ్రా పని తీరు ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించింది.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూలి్చవేతలు చేపడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా ఏర్పాటు, విధులు, చట్టబద్ధతపై పూర్తి వివరాలు సమరి్పంచాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం అలియాపూర్ గ్రామంలోని తమ నిర్మాణాలను కూలగొట్టడాన్ని సవాల్ చేస్తూ డి.లక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా ఏర్పాటు చట్ట విరుద్ధమని, ఈ మేరకు జారీ చేసిన జీవో 99ను కొట్టేయాలని కోర్టును కోరారు. చట్టబద్ధతలేని, నోడల్ ఏజెన్సీగా ఉన్న హైడ్రాకు విపరీత అధికారాలు కట్టబెట్టడం చెల్లదని, నోటీసులు కూడా జారీ చేయకుండా నిర్మాణాలను కూల్చడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. వాదనల అనంతరం కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించారు. కూలి్చవేతల విషయంలో ఆస్తుల టైటిల్, విద్యుత్ బిల్లుల రసీదులు తదితరాలు పరిశీలించాలని హైడ్రాకు స్పష్టం చేశారు. తర్వాత నోటీసులు జారీ చేసి, చట్టప్రకారం ముందుకు పోవాలని మరోసారి తేలి్చచెప్పారు. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment