హైడ్రా ఫిర్యాదులో ఇద్దరు అధికారులకు హైకోర్టు ఊరట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ అథారిటీ (హైడ్రా) ఫిర్యాదు మేరకు దాఖలైన కేసులో తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగాన్ని ఆదేశిస్తూ ఇద్దరు అధికారులకు హైకోర్టు ఊరట కల్పించింది. బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 35(3) కింద నోటీసులు జారీ చేయాలని, నిందితులైన అధికారుల వాదన వినాలని స్పష్టం చేసింది. సైబరాబాద్ కమిషనరేట్‌లోని వివిధ ప్రాంతాల్లోని చెరువుల్లో అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించినందుకు ఆరుగురు అధికారులపై ఆగస్టు 30న హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్ ఫిర్యాదు చేశారు. ఎర్రకుంట చెరువు విస్తీర్ణం 3.033 ఎకరాలు ఉండగా, తప్పుడు జియో కో–ఆర్డినేట్‌ల ఆధారంగా అనుమతులు మంజూరు చేశారన్నది ఫిర్యాదులోని సారాంశం.
ఈ ఫిర్యాదు మేరకు ఆ అధికారులపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) కేసు నమోదు చేసింది. నేరపూరితకుట్ర, అధికార దురి్వనియోగం తదితర సెక్షన్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో మేడ్చల్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కె.శ్రీనివాసులు, బాచుపల్లి తహసీల్దార్ పూల్‌సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టారు. ఈ విచారణకు పిటిషనర్ తరఫున న్యాయవాది టి.శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వం తరఫున ఏపీపీ హాజరయ్యారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. క్రిమినల్ ప్రొసీడింగ్‌లపై స్టే ఇచ్చేందుకు, అభియోగాల రద్దుకు నిరాకరించారు. అయితే, నిబంధనల మేరకు దర్యాప్తు కొనసాగించాలని, ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment