నిమ్స్‌ పగ్గాలు ఎవరికో..!  | Search Committee For Appointment Of New Director NIMS | Sakshi
Sakshi News home page

నిమ్స్‌ పగ్గాలు ఎవరికో..! 

Published Fri, Sep 9 2022 12:38 AM | Last Updated on Fri, Sep 9 2022 8:04 AM

Search Committee For Appointment Of New Director NIMS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/లక్డీకాపూల్‌: నిజామ్‌ వైద్య విజ్ఞాన సంస్థ(నిమ్స్‌)కు కొత్త డైరెక్టర్‌ ను నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే వార్తలు రావడంతో ఈ విషయమై పలు ఊహాగానాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త డైరెక్టర్‌ నియామకం కోసం ప్రభుత్వం సెర్చ్‌ కమిటీ వేయనున్నట్టు సమాచారం. ఈ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత నిమ్స్‌కు కొత్త డైరెక్టర్‌ నియమితులవుతారు. ప్రస్తుత డైరెక్టర్‌ మనోహర్‌ అనారోగ్యం దృష్ట్యా కొనసాగలేనని చెప్పడంతో కొత్త డైరెక్టర్‌ నియామకం అనివార్యంగా మారింది.  

ప్రతిష్టాత్మక సంస్థ..ప్రతిష్టాత్మక పదవి! 
ప్రతిష్టాత్మక నిమ్స్‌కు తొలిసారిగా 1985లో నాటి ప్రభుత్వం డైరెక్టర్‌ను నియమించింది. అప్పటి నుంచి ఆ పదవి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. తొలి డైరెక్టర్‌గా కాకర్ల సుబ్బారావు (1985–1990) నియమితులు కాగా, ఆ తర్వాత 1997–2004 మధ్య కూడా రెండుసార్లు ఆయనే డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన కాకుండా డా.ప్రసాదరావు (2004–2010) కూడా ఐదేళ్లకు పైబడి డైరెక్టర్‌గా ఉన్నారు. మిగిలిన డైరెక్టర్లు, ఇన్‌చార్జి డైరెక్టర్లు ఏడాది నుంచి 3 ఏళ్ల కాలవ్యవధి వరకు మాత్రమే పదవిలో కొనసాగారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా ఉన్న మనోహర్‌ 2015 ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటిదాకా చూస్తే ఆయన లాగా ఏకబిగిన ఎక్కువ కాలం (ఏడేళ్లు) డైరెక్టర్‌ పదవిలో కొనసాగిన వారు మరొకరు లేకపోవడం గమనార్హం.  

సమస్యాత్మకం కూడా.. 
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు నిమ్స్‌లో వైద్య సేవలకు తరలివస్తుంటారు. నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉండే నిమ్స్‌ డైరెక్టర్‌ పదవి ఎంత ప్రతిష్టాత్మకమో అంతే సమస్యాత్మకం కూడా. సంపన్నుల నుంచి నిరుపేదల వరకు అందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బృహత్తర బాధ్యతలు ఒకపక్క, ఎప్పటికప్పుడు అనుభవంలోకి వచ్చే పాలనాపరమైన ఇబ్బందులు మరోపక్క.. వీటన్నింటినీ సమన్వయం చేస్తూ ఒకరకంగా కత్తి మీద సామే చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం ఈ పదవిలో నియమించే వ్యక్తిని ఆచితూచి ఎంపిక చేస్తుంది. అయినప్పటికీ పెద్ద, ప్రతిష్టాత్మక సంస్థ కావడంతో డైరెక్టర్‌ బాధ్యతలు నిర్వర్తించేందుకు ప్రముఖ వైద్యులు ఆసక్తి చూపిస్తుంటారు. 

పోటా పోటీ 
ప్రస్తుతం నిమ్స్‌ డైరెక్టర్‌ పోస్టు కోసం పలువురు రేసులో ఉన్నట్టు వినిపిస్తోంది. నిమ్స్‌ డీన్‌ డాక్టర్‌ రామమూర్తి, మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌.సత్యనారాయణ, కార్డియాక్‌ సర్జన్‌ డా.ఆర్వీ కుమార్, డాక్టర్‌ బీరప్ప (సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ), న్యూరో సర్జరీ విభాగం అధిపతి డాక్టర్‌ ఎం.విజయసారథి, నెఫ్రాలజీ హెడ్‌ గంగాధర్‌లు ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు వైద్యవిద్య డైరెక్టర్‌(డీఎంఈ) రమేష్‌రెడ్డి పేరు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. కొంతకా లంగా నిమ్స్‌ అందిస్తున్న వైద్య సేవల విషయంలో పలు విమర్శలు వినిపిస్తు న్నాయి. దిగువస్థాయి సిబ్బందిలో నిర్ల క్ష్యం బాగా పెరిగిందని అంటున్నారు. రోగులకు పడకలు సహా వసతుల కొర త ఉందని, ఆరోగ్యశ్రీ సేవల్లో లోపాలు సమస్యగా మారుతున్నాయని తెలుస్తోంది. కొన్ని వార్డుల్లో సిబ్బంది అవినీతిపై రోగుల ఆరోపణలూ వినవస్తున్నాయి. కొత్తగా వచ్చే డైరెక్టర్‌ వీటిపై దృష్టిసారించి పనిచేయాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement