పుష్కలంగా నీళ్లు.. ఎడారి లాంటి మారుమూలలనూ తడుపుతున్న నదీ జలాలు.. కోటిన్నర టన్నుల వరకు వరి దిగుబడికి సానుకూల పరిస్థితులు.. ధాన్యాగారం పంజాబ్ తర్వాత మనమేనని గర్వంగా చెప్పుకోగలిగే కీర్తి.. ఇది ఇప్పుడు వినిపిస్తున్నమాట. కానీ, నేటి కాలాన్ని దిగదుడుపు చేస్తూ రెండు శతాబ్దాల కిందటే వరంగల్ రైతులు పొలాల్లో సాగు విప్లవమే సృష్టించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశోధించి వరి చేలో హలధారుల గణకీర్తిని అక్షరబద్ధం చేశాడో బ్రిటిష్ వైద్యుడు. ఆ నివేదికను బ్రిటిష్ రెసిడెంట్‌కు అందించి ఓరుగల్లు రైతుల అద్భుత పనితీరును కళ్లకుకట్టాడు. ఇది 180 ఏళ్ల కింద ‘స్టాటిస్టికల్ రిపోర్ట్ ఆన్ సర్కార్ ఆఫ్ వరంగల్’పేరుతో ‘మద్రాస్ జర్నల్ ఆఫ్ లిటరేచర్ అండ్ సైన్స్’మేగజైన్‌లో అచ్చయింది. ‘అటకెక్కిన’పుస్తకాల దొంతరలో అంతర్ధానమయ్యే వేళ పుదుచ్చేరిలోని కాంచి మామునివర్ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పీజీ స్టడీస్ అండ్ రీసెర్చ్ హిస్టరీ విభాగాధిపతి బి.రామచంద్రారెడ్డి గుర్తించి సేకరించారు. దీంతో అలనాటి ఓరుగల్లు ప్రాంతంలో పంటలు, ప్రత్యేకంగా వరి విప్లవం, నాటి సాగునీరు, భూముల వివరాలు ఇప్పటి తరానికి తెలిసే అవకాశం కలిగింది.
– సాక్షి, హైదరాబాద్
ఇలా మొదలైంది..
ముందునుంచి తెలంగాణ ప్రాంతం వ్యవసాయంపైనే ఆధారపడింది. సాగునీటి లభ్యతతో సంబంధం లేకుండా పొలాన్ని నమ్ముకుంది. అందునా.. వరికి ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. నిజాం జమానాలో అందుబాటులోని సాగునీటిని వాడుకుంటూ నాటి కర్షకులు అద్భుతాలే సృష్టించారు. నీటి లభ్యత తక్కువగా ఉండటంతో తక్కువ నీటితోనే ఎక్కువ దిగుబడినిచ్చే కొత్తరకం వంగడాలను సృష్టించి గొప్ప మేధస్సుందని నిరూపించారు. ఇక్కడ పాలన నిజాందే అయినా.. క్రమంగా కంటోన్మెంట్‌లను ఏర్పాటు చేసుకుని బ్రిటిష్ సైన్యం ఆధిపత్యం చలాయించేవేళ ఈ సాగు పద్ధతులపై ఆంగ్ల పాలకులు ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. నిజాం–బ్రిటిష్ పాలకుల మధ్య పన్నుల లావాదేవీలో, మరే ఇతర కారణాలో స్పష్టత లేదు కానీ.. ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాల్లో భూములు, సాగునీటి ప్రత్యేకతలు, పంటల వివరాలను సేకరించాలని నిర్ణయించారు. స్థానిక బ్రిటిష్ రెసిడెంట్ ప్రత్యేకంగా ఈ బాధ్యతను కంటోన్మెంట్ ఆసుపత్రిలో సర్జన్‌గా ఉన్న ఎ.వాకర్‌కు అప్పగించారు. ఆయన ప్రత్యేక విధుల పేరుతో నాటి వరంగల్ సర్కార్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని అక్కడ అధ్యయనం చేసి వివరాలు సేకరించారు. నేలల స్వభావం, ఏయే నేలల్లో ఎలాంటి పంటలు పండుతున్నాయి, రైతులు ఏయే కాలాల్లో ఏం పంటలు వేస్తున్నారు, సాగు నీటి స్వభావం.. ఇలా చాలా వివరాలు సేకరించారు. అన్నింటిలోనూ ఆయన దృష్టి వరిపై పడింది. దీంతో ప్రత్యేకంగా వరి వంగడాల చిట్టా రూపొందించారు.
మళ్లీ పరిశోధన అవసరం..
‘గతంలో పండించిన అద్భుత వంగడాలపై ఇప్పుడు ఆసక్తి లేకుండా పోయింది. కొత్త వంగడాల మోజులో వాటిని వదిలేశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆసక్తి చూపేలా అలనాడు పండిన పంటలపై మళ్లీ పరిశోధనలతో కూడిన వివరాలు, ఆ పంటలు రావాలి.’
– జలపతిరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం విశ్రాంత అధికారి
32 రకాల వంగడాలివి... : బతిక్ ధాన్, గూటుమొలకలు, గుర్కసన్నాలు, పచ్చగన్నేర్లు, సుపురాయినాలు, బంగారు తీగలు, కుంకుమ పూలు, మూడుగొటిమెలు, కకలాలపుచ్చెలు, ఇప్పవడ్లు, మసూరి వడ్లు, పులి మూసలు, గోదావరి ఉస్కెలు, చిట్టిముత్యాలు, గుంభోజులు, కుత్తకిస్మూరలు, బుల్లిమచ్చలు, తెల్ల మచ్చెలు, తాటిపెల్లు, కాకిరెక్కలు, చామకూరలు, చండ్రమున్కలు, కొంగగొర్లు, పొట్టి మొలకలు, అడెంగలు, బూరవడ్లు, రెడ్డిసామికటికెలు, డోండ్రీ సంకెలు, మైల సామలు, గరిడురొడ్లు, బుంజాలు.
వంద రకాలున్నా.. 32 ప్రత్యేకం..
వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన పరిశోధన చేసే సమయానికి దాదాపు వంద రకాల ధాన్యాన్ని పండిస్తున్నారని గుర్తించారు. అయితే ఇందులో ఎక్కువ మంది రైతులు 32 రకాల వంగడాలపై ఆసక్తి చూపుతున్నారని తేల్చారు. కాకిరెక్కలు లాంటి వడ్లు నల్లగా ఉండేవి, కానీ బియ్యం తెల్లగా మెరిసేవి. చిట్టి ముత్యాలు చిన్న ముత్యాల్లా మెరుస్తూ ఉండేవి. బియ్యం వండితే ఘుమఘుమలాడేది. గోదావరి ఉస్కెలు ఎత్తుగా పెరిగే వంగడం, బియ్యం బరువుగా, సువాసనతో ఉండేవి. కుంకుమపూలు సులభంగా పండే వంగడం. తక్కువ నీటినే వాడుకుంటుంది. ఆ బియ్యానికి శక్తివంతమైనవన్న పేరుంది. ఇలాంటి సమగ్ర వివరాలనే బ్రిటిష్ రెసిడెంట్‌కు అందించారు. ఆ మేరకు అప్పట్లో ప్రతిష్టాత్మక మద్రాసు జర్నల్‌లో అది ప్రచురితమైంది. ఈ వివరాల ఆధారంగా బ్రిటిష్ పాలకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారన్న విషయం మాత్రం అందులో స్పష్టం చేయలేదు.
ప్రత్యేకంగా అనిపించి సేకరించా
‘నా పరిశోధనకు సమాచారాన్ని సేకరించే క్రమంలో మద్రాస్ ఆర్కీవ్స్‌కు వెళ్లినప్పుడు బ్రిటిష్ వైద్యుడు వాకర్ సేకరించిన వివరాలతో ప్రచురణ కనిపించింది. చాలా ఆసక్తిగా అనిపించడంతో దాన్ని సేకరించి మళ్లీ ముద్రించుకున్నాను’.
– బి.రామచంద్రారెడ్డి
అవి గొప్ప వంగడాలు
‘వరిలో అలనాడు అద్భుత వంగడాలు సృష్టించి పండించారు. ఇప్పటి తరానికి వాటి పేర్లు కూడా చాలా వరకు తెలియదు. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేలా ఉండేవి. అందుకే నేను సంప్రదాయ వంగడాలను తిరిగి సృష్టించి పండిస్తున్నా. ప్రస్తుతం వంద రకాల వరిధాన్యాలు పండుతున్నాయి’. – నాగుల చిన్నగంగారాం, నిజామాబాద్, అభ్యుదయ రైతు.
Comments
Please login to add a commentAdd a comment