సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకోనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న రెండోవిడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభానికి ఈ నెల 14న గద్వాలకు అమిత్ షా రావాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమంలో జరిగిన మార్పుల కారణంగా 15న అమిత్ షా గద్వాల(జంబులాంబ దేవాలయం సమీపం) బహిరంగసభలో పాల్గొనడం ద్వారా ఈ పాదయాత్రను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
14న దేశవ్యాప్తంగా రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని నిర్వహిస్తున్న నేపథ్యంలో అమిత్‌షా కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున ఈ మేరకు మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి గద్వాలకు రోడ్డు మార్గాన వెళ్లేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నందున, కర్నూలు నుంచి గద్వాలకు రోడ్డుమార్గం గుండా చేరుకునేలా కార్యక్రమంలో మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 14న ముందుగా నిర్ణయించిన విధంగా జోగుళాంబ ఆలయంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర కోసం పూజలు నిర్వహించి, ఆ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment