మెదక్ జిల్లా శివ్వంపేట హైస్కూల్‌లో పురుగులు పట్టిన బియ్యం
సాక్షి, మెదక్: కరోనా నేపథ్యంలో పాఠశాలలు తెరుచుకోకపోవడంతో మధ్యాహ్న భోజన బియ్యం పాడైపోతున్నాయి. సంచులను ఎలుకలు కొరికివేయడం.. పురుగులు పట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది క్వింటాళ్ల మేర వృథాగా మారాయి. రాష్ట్రంలో వివిధ యాజమాన్యాల పరిధిలో 41 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 55 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రోజుకు 100 గ్రాముల చొప్పున.. ఆరు నుంచి పదో తరగతి వరకు రోజుకు 150 గ్రాముల చొప్పున మధ్యాహ్న భోజన బియ్యం కేటాయిస్తున్నారు. ఈ లెక్కన నెలకు సరిపడా బియ్యాన్ని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పంపిణీ కేంద్రం నుంచి తీసుకొచ్చి నిల్వ ఉంచుతున్నారు. ఇలా నిల్వ ఉంచిన వాటిలో సుమారు ముప్పావు వంతు బియ్యం ముక్కిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లాలు, పాఠశాలల వారీగా లెక్కలు తీస్తున్న విద్యాశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులకు సూచించారు.
సుమారు 15 వేల క్వింటాళ్లు వృథా
జూన్‌లో విద్యాసంవత్సరం ప్రారంభం కావాల్సి ఉంది. కోవిడ్ కారణంతో ఇప్పటి వరకు బడులు తెరుచుకోలేదు. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులు గత నెల నుంచే స్కూళ్లకు వస్తున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతున్నారు. మెదక్ జిల్లాలో పరిశీలిస్తే స్కూళ్లు మూతపడే నాటికి సుమారు 1,633.62 క్వింటాళ్ల సన్న బియ్యం నిల్వ ఉంది. ఇందులో 493.21 క్వింటాళ్లు పాడైపోయాయి. 236.31 క్వింటాళ్లు పాక్షికంగా.. 256.90 క్వింటాళ్లు పూర్తిగా పురుగులు పట్టి ముక్కిపోయాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేల క్వింటాళ్ల మేర మధ్యాహ్న భోజన బియ్యం వృథా అయినట్లు విద్యాశాఖ అధికారుల అంచనా.
జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు
స్కూళ్లు తెరవకపోవడంతో పాఠశాలల్లో నిల్వ ఉన్న మధ్యాహ్న భోజన బియ్యం పాడవుతున్నాయని ప్రధానోపాధ్యాయులు ఎప్పటికప్పుడూ జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి పలుమార్లు తీసుకొచ్చారు. ఎట్టకేలకు గ్రహించిన రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాలు, పాఠశాలల వారీగా సమాచారం సేకరించారు. అంతేకాకుండా తగు జాగ్రత్తలు తీసుకుని పొడి ప్రదేశాల్లో నిల్వ చేయాలని సూచించారు. పాఠశాలలు తెరిచిన తర్వాత వాటిని వినియోగించకుండా చూడాలని ఆదేశించారు.
25% బియ్యం పాడైపోయాయి
శివ్వంపేట మండలంలో 75 పాఠశాలలకు సంబంధించి 85.11 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉంది. పలు స్కూళ్లలో తడవడం, పురుగులు పట్టడం మూలంగా 25 శాతం మేర పాడైపోయాయి. పనికి రాని బియ్యంపై ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చాం. ఇప్పటి వరకైతే ఎలాంటి ఆదేశాలు రాలేదు.
– బుచ్చనాయక్, ఎంఈఓ, శివ్వంపేట, మెదక్
జాగ్రత్తలు తీసుకుంటున్నాం
పలు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన బియ్యం పురుగులు పట్టాయి. అసలే పనికి రాని వాటిని వేరు చేశాం. వాటిని వినియోగించకుండా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చాం. ప్రస్తుతం ఉన్న వాటిని బల్లాలపై, కుర్చీల్లో తేమలేని చోట నిల్వ చేసేలా చర్యలు తీసుకున్నాం.
– రమేష్ కుమార్, డీఈఓ, మెదక్
Comments
Please login to add a commentAdd a comment