సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 2022–23 సంవత్సరంలో మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు దాదాపు రూ.16 వేల కోట్ల మేర రుణాలు అందించేందుకు కసరత్తు సాగుతోంది. ఎస్‌హెచ్‌జీ బ్యాంక్ లింకేజీ వార్షిక కార్యాచరణకు పంచాయతీరాజ్ శాఖ శ్రీకారం చుట్టనుంది. బుధవారం దీనికి సంబంధించిన జిల్లాలవారీగా వార్షిక రుణప్రణాళికను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించనున్నారు.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణ ప్రణాళికను ఆమోదించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 3,70,647 (కొత్తగా ఏర్పడిన సంఘాలతో సహా) సంఘాల్లోని దాదాపు 40 లక్షల మంది సభ్యులకు రూ.16 వేల కోట్ల మేర బ్యాంక్ లింకేజీలు కల్పిస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో 4,304 కొత్త సంఘాలు ఏర్పడ్డాయి. అందులో 41,889 మంది కొత్త సభ్యులను చేర్చారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఘాలు, సభ్యులకు కూడా బ్యాంక్ లింకేజీలు అందిస్తారు. ఆరు నెలలు దాటిన కొత్త సంఘాలకే బ్యాంక్ లింకేజీలు అందజేస్తారు. సంఘాల పరపతి, రుణాల చెల్లింపు తదితర అంశాల ప్రాతిపదికన వారికి లింకేజీలు కల్పిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళాసంఘాల్లో దాదాపుగా అన్ని కుటుంబాలు లబ్ధి పొందేలా ప్రణాళికలు రూపొందించినట్టు అధికారులు చెబుతున్నారు.
2022–23లో లక్ష్యాలివే...
♦అత్యధికంగా రుణలక్ష్యాలు ఉన్న జిల్లాలు... నిజామాబాద్ జిల్లాలో 21,786 సంఘాలకుగాను దాదాపు రూ.1,032 కోట్లు, నల్లగొండ జిల్లాలో 25,782 సంఘాలకుగాను దాదాపు రూ.959 కోట్లు, ఖమ్మం జిల్లాలో 21,766 సంఘాలకుగాను దాదాపు రూ.931 కోట్లు.
♦అత్యల్పంగా టార్గెట్ గల జిల్లాలు... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 2,785 సంఘాలకు (కేవలం 5 మండలాలు) దాదాపు రూ.139 కోట్లు, జోగుళాంబ గద్వాల జిల్లాలోని 5,297 సంఘాలకు దాదాపు రూ.178 కోట్లు, కొమురంభీమ్ జిల్లాలోని 6,481 సంఘాలకు దాదాపు రూ.199 కోట్లు, ములుగు జిల్లాలోని 5,571 సంఘాలకుగాను దాదాపు రూ.196 కోట్లుగా ఉంది.
పాతికేళ్లుగా...
రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కార్యక్రమాన్ని దాదాపు పాతికేళ్ల క్రితం ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేద, పేదలను గుర్తించి, వారిని స్వయం సహాయక సంఘాల కింద సంఘటితం చేశారు. మహిళాసాధికారత సాధనకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) కృషి చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment