కూటమి నేతల కుతకుత!
● టీటీడీ బోర్డులో చోటు కల్పించకపోవడంపై అసంతృప్తి ● తిరుపతిలోని యాదవులు, తిరుమలలోని బ్రాహ్మణులకు మొండిచేయి ● మరో హామీని గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో చోటు దక్కకపోవడంపై కూటమి నేతలు కుతకుతలాడిపోతున్నారు. మంత్రి వర్గంలో తిరుపతి, చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులకు స్థానం లేకపోవడంతో టీటీడీ బోర్డులో అయినా అవకాశం ఇస్తారని ఆశగా ఎదురుచూసి నేతల ఆశలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నీళ్లు చల్లేశారు. టీటీడీ పాలకమండలి సభ్యుడి పదవి తమకే అంటూ ప్రచారం చేసుకున్నవారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యుటీ సీఎం పవన్‌కల్యాణ్ కలిసి తమకు అన్యాయం చేశారని రగలిపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఐదునెలల తర్వాత బుధవారం టీటీడీ బోర్డుని ప్రకటించింది. అయితే ఈ బోర్డులో తాము ఉంటామని కూటమి నేతల్లో పలువురు నమ్మకంగా ఉన్నారు. అందులో మొదటి వరుసలో ఎన్టీఆర్ రాజు కుమారుడు శ్రీధర్‌వర్మ ఒకరు. ఎన్టీఆర్ హయాంలో రాజుకి అవకాశం దక్కింది. ఆ తర్వాత ఆ కుటుంబంలోని శ్రీధర్‌వర్మకు పాలకమండలి సభ్యుడు కావాలని ఆశపడ్డారు. ఈ విషయాన్ని పలుమార్లు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అలాగే టీటీడీ బోర్డు మాజీ సభ్యులు డాక్టర్ హరిప్రసాద్, ఓవీ రమణ, భానుప్రకాష్‌రెడ్డి సైతం ఆశవహుల్లో ఉన్నారు. ఈ మేరకు తమ పార్టీల అధినేతలకు సైతం పలుమార్లు విన్నవించారు. శ్రీకాళహస్తి నుంచి కోలా ఆనంద్ కూడా పాలకమండలిలో స్థానం కోసం ముమ్మరంగా ప్రయత్నించారు. ఇకపోతే తిరుపతి జిల్లాలో జనసేన కీలకమైన నాయకుల్లో ఒకరైనా కిరణ్‌రాయల్ కూడా పాలకమండలిలో చోటు దక్కుతుందని నమ్మకంతో ఉన్నారు. అయితే వీరెవ్వరికీ బోర్డులో స్థానం దక్కలేదు. ఈ క్రమంలోనే చిత్తూరు జిల్లా నుంచి పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డికి మంత్రి వర్గంలో స్థానం లభించకపోయినా టీటీడీ పాలకమండలిలో అవకాశం ఇస్తారని టీడీపీ నాయకులు ఎదురుచూశారు. పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన చల్లా రామచంద్రారెడ్డి, పుంగనూరుకే చెందిన రామచంద్రయాదవ్ సైతం టీటీడీ బోర్డులో స్థానం కోసం యత్నించారు.
మాట నిలబెట్టుకోని బాబు
తిరుమలలో పనిచేసే బ్రాహ్మణులు, తిరుపతికి చెందిన యాదవులకు టీటీడీ బోర్డులో అవకాశం కల్పిస్తామని గతంతో చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం బోర్డు ఏర్పాటులో ఆ విషయాన్ని అసలు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆయా సామాజికవర్గాల వారు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాటను చంద్రబాబు నిలబెట్టుకోలేదని మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment